వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని ఎదుర్కోవడంలో తామే దీటైన నాయకుడినని నిరూపించుకునేందుకు టీడీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, 84 ఏళ్ల వృద్ధ నాయకుడు నంద్యాల వరదరాజులరెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌రెడ్డి యువకుడే అయినప్పటికీ, వరదరాజులరెడ్డితో పోటీ పడడంలో విఫలమయ్యారు.
టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌రెడ్డి ఎంతసేపూ కెమెరాల ఎదుట హడావుడి చేయడమే తప్ప, క్షేత్రస్థాయికి వెళ్లి అధికార పార్టీ నేతల ఆగడాలపై పోరాటం చేయడం లేదన్న ఆరోపణ వుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిపై భూబకాసురుడంటూ వరదరాజులరెడ్డి పట్టణంలో భారీ ప్లెక్సీలు వేయించారు. ఇది తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే భూదాహానికి వ్యతిరేకంగా వరదరాజులరెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లుపై వరద తీవ్ర ఆరోపణలు చేశారు.
తనపై వరద ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చెన్నకేశవ ఆలయానికి సంబంధించి నాలుగు ఎకరాల పొలంలో కేవలం పది సెంట్లలో తన సొంత నిధులు రూ.3 లక్షలతో రోడ్డు సౌకర్యం కల్పించానని తెలిపారు. ప్రజలకు ఉపయోగకరంగా చేయడాన్ని స్వాహా అంటారా? అని ఆయన నిలదీశారు. 25 సంవత్సరాల క్రితం వరదరాజులరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి, ఘరానా మోసగాడు ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వరదరాజులరెడ్డి కుటుంబం భూస్వాహాకు పాల్పడిందని ఆరోపించారు.
భూమి విషయంలో ఒక బ్రాహ్మణుడిని అన్యాయంగా పెట్రోల్ పోసి చంపేశావని సంచలన ఆరోపణ చేశారు. ఆస్తి కోసం బ్రాహ్మణుడి సజీవ దహనానికి పాల్పడిన చరిత్ర వరదరాజులరెడ్డిదని ఆయన మండిపడ్డారు. ఆ కేసులో మీ మనుషులు ముద్దాయిలు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఆ రోజు నీ పార్టీ అధికారంలో వుండడం వల్ల కేసు నుంచి కుమారుడిని తప్పించావని ఆయన ఆరోపించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడిని కూడా తప్పించావన్నారు.
అనామకుల్ని నిందితులుగా చేశావని వరదపై ఆరోపణలు చేశారు. ఆ వివాద స్థలం విజయవాడలో వుందని, ఇప్పుడు దాని విలువ రూ.200 కోట్లు అని రాచమల్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అసలు నీకు నీతి వుందా? అని నిలదీశారు. వరదరాజులరెడ్డికి రాజకీయ సమాధి కట్టేంత వరకూ శ్వాస వదిలే ప్రశ్నే లేదని రాచమల్లు శపథం చేశారు.
తన ధనం, మానం, ప్రాణం పోయినా పర్వాలేదని, వరదకు మాత్రం రాజకీయ సమాధి కట్టి తీరుతానని రాచమల్లు ప్రకటించారు. వరదరాజులరెడ్డి లాంటి దుర్మార్గుడు, అబద్ధాలోడు లేడని ఆయన అన్నారు. అతని లాంటి పదవీ వ్యామోహం ఉన్న నాయకుడు మరొకరు లేడన్నారు. వరదకే టికెట్ రావాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. వయసులో పెద్దవాడివని ఇంతకాలం ఓపిక పట్టానన్నారు. ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.