పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ జనసేన అధిపతి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జనసేనకు అంతో ఇంతో క్రేజ్ నడుస్తోంది అది వాస్తవం. కుర్రకారు జనసేన అంటూ కాస్త ఊగుతున్నారు. అది కూడా వాస్తవం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పవన్ క్రేజ్ పెరుగుతోందా? తగ్గుతోందా? అన్నది ఓ ప్రశ్న. లేదా ఆయనకు ఆయనే తగ్గించుకుంటున్నారా? అన్నది ఓ అనుమానం.
అసలు పవన్ క్రేజ్ ఇప్పుడు జనసేన అధిపతిగానా? సినిమా హీరోగానా? అన్నది ఇంకో ధర్మ సందేహం. ఈ అనుమానాలకు, సందేహాలకు తగిన రీజన్లు, లాజిక్ లు లేకపోలేదు.
వయసు మీద పడినా వృద్ద సింహంలా గాండ్రిస్తూ రాష్ట్రం అంతా కలయతిరిగేస్తున్నారు చంద్రబాబు. ఓ ప్లాన్ ప్రకారం పద్దతి ప్రకారం ఆయన ప్రచారం పక్కాగా సాగుతోంది. అలాగే లోకేష్ కూడా తాను వదిలి పెట్టిన యువగళం యాత్రను కొనసాగిస్తున్నారు. కానీ ఎటొచ్చీ ఇంట్లో కూర్చుని ప్రకటనలు ఇస్తున్నది ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే.
వారాహి యాత్ర అన్నారు. మనల్ని ఎవర్రా ఆపేది అన్నారు. ఈస్ట్ కొంత తిరిగారు. వెస్ట్ కొంచెం తిరిగారు. చంద్రబాబు అరెస్ట్ కావడంతో వారాహిని షెడ్ లో పెట్టారు. చంద్రబాబు జైల్లో వుండగానే కృష్ణ జిల్లా నుంచి మళ్లీ పవన్ వారాహి యాత్ర మొదలు అన్నారు కానీ కాలేదు. కొన్నాళ్లకు మొదలుపెట్టి కృష్ణా జిల్లాలో కాపులు అధికంగా వుండే ప్రాంతాల్లో చిన్న టూర్ చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జనంలోకి రాలేదు.
ఎంత సేపూ ఈస్ట్ గోదావరి మీద దృష్టి పెట్టారు తప్ప మరో వైపు దృష్టి లేదు. ఉత్తరాంధ్ర వదిలేసారు. గుంటూరు ఊసేలేదు. రాయలసీమ అంతంత మాత్రం. పవన్ వ్యవహారం ఇలా వుంటే తెలుగుదేశం మాత్రం ఊపు మీద ముందుకు వెళ్లిపోతోంది. అదే టైమ్ లో పవన్ పార్టీ మహా అయితే ముఫైకి మించిన సీట్లలో పోటీ చేయదు అన్న క్లారిటీ మెలమెల్లగా వచ్చేస్తోంది. దీంతో పార్టీ శ్రేణులు సర్దుకోవడం మొదలుపెట్టాయి. మరోపక్కన వలస వాదులకు, ఆఖరి నిమషంలో పార్టీలోకి వస్తున్న వారికి పెద్ద పీట వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది చూసి మొదటి నుంచి జనసేన కాడిని భుజనా మోస్తున్నవారు నిట్టూరుస్తున్నారు. మన పనులు మానుకుని ఎందుకు ఈ చాకిరీ అనే మాటలు జనసేన సభ్యుల ఆంతరింగిక చర్చల్లో వినిపిస్తున్నాయి.
పార్టీ పరంగా పవన్ పరిస్థితి ఇలా వుంటే సినిమాల పరంగా కూడా గొప్పగా లేదు. భీమ్లా నాయక్, బ్రో సినిమాలు ఆశించిన మేరకు విజయాలు సాధించలేదు. పవన్ చరిష్మా నిజంగా వుంటే ఆ సినిమాలు అద్భుతంగా ఆడాల్సి వుంది. కానీ అదీ లేదు. నిర్మాణంలో మూడు సినిమాలు వుంటే వాటిలో ఒకటే పూర్తి చేస్తారని, మిగిలినవి వుండవు అని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. చూస్తుంటే సినిమాల మీద కూడా పవన్ కు ఆసక్తి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ కావాలని కట్టడి చేసి, పవన్ ను తిరగకుండా ఆపేస్తోందా? పవన్ క్రేజ్ పెరిగితే జనసేనకు మరిన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందని అలా చేస్తోందా అనే కామెంట్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పవన్ ఎందుకిలా చేస్తున్నారో, ఆయన స్ట్రాటజీ ఏమిటో ఎవరికీ తెలియడం లేదు. స్ట్రాటజీ ఏమైనా జనాల్లో వుంటేనే మనుగడ వుంటుంది రాజకీయ నాయకులకు. ఆఫీసుల్లో కూర్చుని సమీక్షలు చేసి, ప్రకటనలు వదుల్తుంటే వుండదు. మరి పవన్ ఎప్పుడు గమనిస్తారో ఈ విషయాన్ని.