నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా…లిక్క‌ర్ కేసు నిందితుడు!

నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి దీటైన అభ్య‌ర్థిని బ‌రిలో దింపేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేశారు. అర‌బిందో ఫార్మా కంపెనీ డైరెక్ట‌ర్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి అన్న అయిన శ‌రత్‌చంద్రారెడ్డిని బ‌రిలో దింపేందుకు…

నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి దీటైన అభ్య‌ర్థిని బ‌రిలో దింపేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేశారు. అర‌బిందో ఫార్మా కంపెనీ డైరెక్ట‌ర్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి అన్న అయిన శ‌రత్‌చంద్రారెడ్డిని బ‌రిలో దింపేందుకు సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థిగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని మొద‌ట సీఎం జ‌గ‌న్ ఖ‌రారు చేశారు.

అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌తో విభేదాలు తారాస్థాయికి చేరాయి. న‌ర‌సారావుపేట ఎంపీ అభ్య‌ర్థిగా అనిల్‌కుమార్ యాద‌వ్‌ను పంపారు. కానీ నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా అనిల్ ముఖ్య అనుచ‌రుడు, డిప్యూటీ మేయ‌ర్ ఖ‌లీల్ పేరు ఖ‌రారు చేశారు. క‌నీసం త‌న‌తో మాట మాత్ర‌మైనా చెప్ప‌కుండా అనిల్ అనుచ‌రుడిని ఎంపిక చేయ‌డంతో వేమిరెడ్డి మ‌న‌స్తాపం చెందారు.

ఆర్థికంగా పార్టీకి అండ‌గా నిలుస్తున్న త‌న‌కు గౌర‌వం ఇవ్వ‌కుండా, ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వేమిరెడ్డి త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నెల్లూరు ఎంపీగా పోటీ చేయ‌న‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. వైసీపీ ముఖ్య నేత‌లు స‌ముదాయించినా ఆయ‌న వినిపించుకోలేదు.

దీంతో వేమిరెడ్డిని ఢీకొట్టేందుకు దీటైన అభ్య‌ర్థి కోసం వైసీపీ పెద్ద‌లు అన్వేషించారు. ఈ క్ర‌మంలో ఫార్మా పారిశ్రామిక‌వేత్త శ‌ర‌త్‌చంద్రారెడ్డి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా వైసీపీ గుర్తించింది. త్వ‌ర‌లో ఆయ‌న పేరు ఖ‌రారు చేయ‌నున్నారు.

ఇదిలా వుండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో శ‌ర‌త్‌చంద్రారెడ్డి నిందితుడు.ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ రూప‌క‌ల్ప‌న‌లో శ‌ర‌త్‌చంద్రారెడ్డి కీల‌క పాత్ర పోషించిన‌ట్టు సీబీఐ, ఈడీ తెలిపాయి. లిక్క‌ర్ కేసులో ఈయ‌న అరెస్ట్ అయ్యారు. అనంత‌రం అప్రూవ‌ర్‌గా మారడంతో జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఏపీ క్రికెట్ అసోసియేష‌న్ చైర్మ‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. రానున్న రోజుల్లో నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.