జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైసీపీ విమర్శల దాడి తీవ్రతరం చేసింది. పవన్‌పై ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతల్ని వైసీపీ ఎక్కుపెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా తదితరులు జనసేనాని పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే తనను దత్తపుత్రుడని విమర్శించడాన్ని పవన్ తట్టుకోలేకపోతున్నారు. కానీ మంత్రులు ఇంకా దూకుడు పెంచారు. పవన్ వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ చెలరేగిపోతున్నారు. రాజకీయాల్లో ఇది అవాంఛ నీయం అయినప్పటికీ, వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడుకోక తప్పదు. ఇదే సందర్భంలో వైసీపీ భుజంపై గన్ పెట్టి పవన్‌పై ఎల్లో మీడియాధిపతి తన అక్కసు తీర్చుకుంటున్నారు. ఇదే పవన్‌కల్యాణ్‌ను ఆవేదనకు గురి చేస్తున్నట్టు సమాచారం. మరో రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో పరస్పరం రాజకీయ దాడులు చేసుకోవడం సహజం.
అయితే టీడీపీకి స్నేహహస్తం ఇవ్వాలని భావిస్తున్న తనపై వైసీపీ వ్యక్తిగత విమర్శలు చేస్తే, వాటికి ఎల్లో మీడియాలో ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని పవన్‌తో పాటు జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కుట్రపూరితంగా సాగుతోందనే ఆవేదన జన సేనలో కనిపిస్తోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ బహుభార్యత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గుడివాడ విమర్శించడం కంటే, వాటికి ఎల్లో మీడియాలో ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కుడ బాధిస్తోందని జనసేన విలవిలలాడుతోంది.
‘పవన్ ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు’ అనే శీర్షికతో గుడివాడ అమర్నాథ్ వ్యక్తిగత విమర్శలకు సదరు పత్రిక ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు… రాజకీయ జీవితంలో కూడా విలువల్లేని వ్యక్తి. పవన్ కల్యాణ్ ఎలాంటి వాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది మేం చెప్పడం కంటే ఆయన రెండో మాజీ భార్య రేణుదేశాయ్‌ని అడిగితే తెలుస్తుంది ’ అని మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శించారు.
ఈ వార్తకు జగన్ సొంత పత్రిక సాక్షిలో ప్రాధాన్యం ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ గతంలో పవన్‌పై కోర్టులో పరువు నష్టం కేసు వేసిన మీడియాధిపతి పత్రికలో గుడివాడ అమర్నాథ్ వ్యక్తిగత విమర్శలకు పెద్దపీట వేయడం వెనుక కుట్ర రాజకీయాలు లేవంటే నమ్మేదెలా? అనే ప్రశ్నలొస్తున్నాయి.
టీడీపీ కోసమే పవన్‌కల్యాణ్ అధికార పార్టీతో తిట్లు తినాల్సి వస్తోందని జనసేన నాయకుల వాదన. అలాంటప్పుడు పవన్‌పై మంత్రుల వ్యక్తిగత విమర్శలను వైసీపీ అనుకూల మీడియా మాదిరిగా చంద్రబాబు మీడియా కూడా అక్కసుతో ప్రచురించడం ఏంటని జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. గతంలో తమ యజమానిపై పవన్ ఘాటు వ్యాఖ్యలను మనసులో పెట్టుకుని, నేడు మంత్రుల సాకుతో ప్రతీకారం తీర్చుకుంటున్నారనే అనుమానం జనసేనలో వ్యక్తమవుతోంది.
సదరు మీడియా నిష్పక్షపాతంగా అందరి వార్తలను ఇదే రీతిలో ప్రచురిస్తుంటే ప్రశ్నించేవాళ్లం కాదంటున్నారు. కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేస్తూ ఎల్లో మీడియాగా ప్రసిద్ధికెక్కడం వల్లే నిలదీయాల్సి వస్తోందని జనసేన నాయకులు అంటున్నారు.