ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. అసలే పీఆర్సీ, ఇతరత్రా లబ్ధి విషయంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందనే ఆగ్రహంతో రగిలిపోతున్న గురువులపై … గోరుచుట్టుపై రోకటిపోటు అనే చందంగా ప్రభుత్వ తాజా నిర్ణయం కోపానికి కారణమైంది. మే 20వ తేదీ వరకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విధులకు హాజరు కావాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. వేసవి సెలవులను మే 6 నుంచి జూలై 3వ తేదీ వరకు ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఉపాధ్యాయులను మాత్రం మరో రెండు వారాలు పాఠశాలలకు వెళ్లాలని ఆదేశించడం ఏంటని విద్యారంగం నుంచి వస్తున్న ప్రశ్న. నూతన పీఆర్సీని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమంలో తాము కీలక పాత్ర పోషించడం వల్లే ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగిందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి ఇచ్చారు. మరి ఆంధ్రాలో మాత్రం సంప్రదాయానికి విరుద్ధంగా స్కూళ్లను ఎందుకు నడుపుతున్నారని ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ సర్కార్ చర్యలు ప్రైవేట్ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ఉందని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. జూన్‌లో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అడ్మిషన్స్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తాయని, ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలు తెరవకపోవడం, వాటికి సహకరించినట్టు అవుతుందనేది ఉపాధ్యాయుల వాదన.
పాఠశాలల్లో అడ్మిషన్స్ చేపట్టాల్సిన సమయంలో విద్యాలయాలు తెరవకుండా, తమను ఇళ్లలో కూచోపెట్టి, ప్రైవేట్ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
అసలు ఒక నిర్ణయం తీసుకునే ముందు, దాని మంచీచెడు గురించి సంబంధిత రంగానికి చెందిన నిపుణులతో చర్చించాలనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని మరింతగా ఉపాధ్యాయులకు శత్రువు చేసే పని మాత్రం విజయవంతంగా సాగుతోంది. ఇందుకు కృషి చేస్తున్న విద్యారంగంలోని ఉన్నతాధికారులను ప్రభుత్వం తప్పక సత్కరించాలనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.