ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు రెండు భిన్నమైన స్వరాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర సారథిగా తనకు తోచిన రీతిలో ఇష్టారాజ్యంగా చెలరేగుతూ వచ్చిన సోము వీర్రాజును పక్కకు తప్పించి.. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ని నియమించిన తర్వాత పరిస్థితులన్నీ గాడిన పడతాయని అందరూ ఊహించారు.
అయితే ఇప్పటికీ కూడా రాష్ట్ర పార్టీలో రెండు పరస్పర విరుద్ధమైన స్వరాలు వినిపిస్తుండడం ఆ పార్టీ కార్యకర్తలను శ్రేణులని గందరగోళానికి గురిచేస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే.. ఒకవైపు పార్టీ నాయకుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- బిజెపి కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. అదే సమయంలో పురందేశ్వరి సారధ్యం స్వీకరించిన కార్యక్రమంలో మాట్లాడుతూ బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు తద్విరుద్ధమైన ప్రకటన చేశారు.
ఏపీలో బిజెపి- జనసేన కూటమి విడిగా పోటీ చేస్తుందని, తామే అధికారంలోకి రాబోతున్నామని ఆయన తెగేసి చెప్పారు. తెలుగుదేశం పార్టీని బిజెపి దూరం పెడుతుందనే సంకేతాలు పంపారు. ఇద్దరు సీనియర్ నాయకులు ఇలాంటి పరస్పర విరుద్ధమైన మాటలు అంటుండడంతో పార్టీ కార్యకర్తల్లో సహజంగానే అయోమయం ఏర్పడుతోంది.
భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల మనోగతాన్ని గమనిస్తే కనుక.. తెలుగుదేశం జనసేన రెండు పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని మాత్రమే ఎన్నికలకు వెళ్లాలనే కోరిక ఎక్కువమందిలో వ్యక్తం అవుతోంది.
జనసేన తో కలిసి గానీ ఒంటరిగా గాని పార్టీ సాధించేది ఏమీ లేదని వారికి తెలుసు. పైగా తెలుగుదేశంతో పొత్తుకు జనసేన ఆల్రెడీ ఫిక్స్ అయిందని కూడా వారికి తెలుసు. ఆ పొత్తులను గౌరవించకుంటే తమ పార్టీ ఒంటరి అవుతుందని, తమ మనుగడకు అది ప్రమాదకరమైన సంకేతం అనే భయం వారిలో కొందరికి ఉంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు అనుకూల వర్గం పొత్తులను కోరుకుంటున్నారు.
జీవీఎల్ నరసింహారావు వంటి నాయకులు మాత్రం పొత్తులు ఉండవని సన్నాయి ఢంకా బజాయించి చెబుతున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పార్టీని కబళించి వేస్తాడని, సొంతంగా నిలదొక్కుకోగల అవకాశాలను ఎప్పటికీ కోల్పోతామనేది వీరి వాదన.
మొత్తానికి భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు నాయుడు తరఫున పనిచేసే కోవర్ట్ నాయకులకు, తమ పార్టీ సహజ క్రమంలో అభివృద్ధి చెంది బాగుపడాలని కోరుకునే కమల వాదులకు మధ్య రగడ షురూ అయినట్లుగా కనిపిస్తోంది.