మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణను ఉద్దేశించి అన్న మాటలు… రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు తెరలేపాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మంత్రి బొత్స అన్న మాటలు తప్పైతే, మరి పదేపదే తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేటీఆర్ చేస్తున్న విమర్శల సంగతేంటని ఏపీ సమాజం ప్రశ్నిస్తోంది. అందుకే సాటి తెలుగు రాష్ట్రం గురించి విమర్శలు చేయడం తెలంగాణ మంత్రులు మానుకుంటే, ఇతరులు కూడా ఏమీ మాట్లాడరని తెలుసుకోవాలని కొందరు హితవు చెబుతున్నారు.
ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, అలాగే ఆ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఇతరత్రా అంశాల్లో కేటీఆర్, హరీష్‌రావు పలు సందర్భాల్లో అసందర్భంగా విమర్శలు చేశారు. వీటికి ఏపీ మంత్రులు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. తాజాగా ఆర్జీయూకేటీల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల తాత్కాలిక జాబితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్సను మీడియా ప్రతినిధులు తెలంగాణలో ఎంసెట్ కౌన్సింగ్ షెడ్యూలు విడుదల చేశారని, ఏపీ సంగతేంటని ప్రశ్నించారు.
బొత్స స్పందిస్తూ తెలంగాణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీసం టీఎస్పీఎస్సీ పరీక్షలు కూడా తెలంగాణలో సరిగా నిర్వహించలేకపోయారని విమర్శించారు. అన్నీ చూచిరాతలు, స్కామ్‌లు జరిగాయన్నారు. చివరికి ఉపాధ్యాయుల బదిలీలు కూడా సరిగా చేసుకోలేని దుస్థితి తెలంగాణలో నెలకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందని, తెలంగాణతో పోల్చొద్దని బొత్స సీరియస్ కామెంట్స్ చేశారు.
బొత్స కామెంట్స్‌పై తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో చెప్పలేని వారు తమ రాష్ట్రంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని తెలంగాణ మంత్రులు విరుచుకుపడ్డారు. బొత్స తన మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణ చెప్పాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి బొత్స లాంటి నాయకులే కారణమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
తమ రాష్ట్రంపై విమర్శలు చేస్తే తెలంగాణ మంత్రుల కోపాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే రీతిలో ఏపీపై తమ మంత్రులు విమర్శలు చేయకుండా నోటిని అదుపు పెట్టుకోవాలని ఏపీకి చెందిన పలువురు కోరుతున్నారు. తెలంగాణ నుంచి కవ్వింపు మాటలు లేకపోతే, ఇటు వైపు నుంచి కూడా ఏమీ వుండవని అంటున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడంలో తెలంగాణ అధికార పార్టీకి మించింది మరేదీ లేదనే టాక్ వినిపిస్తోంది.