సినిమాలకు హైప్ ఇచ్చినట్టే పవన్ యవ్వారం!

రాష్ట్రంలో నాలాంటి గొంతుకలు ఉండకూడదని పిఠాపురం నియోజకవర్గంలో రూ.100 కోట్లు, రూ.150 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అక్కడ నన్ను ఓడించే బాధ్యత ఎంపీ మిధున్ రెడ్డి తీసుకున్నారట. అవసరమరమైతే కుటుంబానికి లక్ష ఇచ్చి కొనేయమంటున్నారట..…

రాష్ట్రంలో నాలాంటి గొంతుకలు ఉండకూడదని పిఠాపురం నియోజకవర్గంలో రూ.100 కోట్లు, రూ.150 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అక్కడ నన్ను ఓడించే బాధ్యత ఎంపీ మిధున్ రెడ్డి తీసుకున్నారట. అవసరమరమైతే కుటుంబానికి లక్ష ఇచ్చి కొనేయమంటున్నారట.. ఓటుకు లక్ష ఇచ్చినా కూడా  నేను లక్ష మెజారటీతో గెలుస్తాను.. ఇవి పవన్ కల్యాణ్ తాజా ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు.

సినిమా హీరోలు సాధారణంగా ఒక రకమైన ఇల్యూజన్ లో బతుకుతూ ఉంటారు. ఎందుకంటే వారు దైవాంశ సంభూతుల్లాగా వారి చుట్టూ ఉండే సినిమా ప్రపంచం నిత్యం భజన చేస్తూ ఉంటుంది. సినిమాలు కూడా చాలా హైప్ మధ్య, అతిశయమైన ప్రచారం మధ్య విడుదల అవుతుంటాయి. సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయినా.. కొన్ని నెలలపాటూ అదొక అద్భుతం, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాతావరణం అలవాటైన సినిమాహీరో పవన్ కల్యాణ్ కు.. వాస్తవాలు అర్థమయ్యే అవకాశం లేదు.

అందుకే తాను గెలవకుండా కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నదని.. తానంటే భయపడుతున్నదని పవన్ చెబుతున్నారు. తన పోటీకి తానే హైప్ ఇచ్చుకుంటున్నారు. మళ్లీ ఇందులో ఒక మడత పేచీ ఉంది. వారు ఎంత ఖర్చు పెట్టినా.. ప్రజలు దీవిస్తే తాను నెగ్గుతానని అంటున్నారు. ప్రజలు దీవించనందువల్లే కదా.. గతంలో ఆయన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు? ఆ సంగతి మర్చిపోతున్నారు.

ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించాలి. రాష్ట్రంలో తమ పార్టీనే ఓడిపోతుందనే అనుమానం వైసీపీకి ఉంటే.. ఇక వారు పవన్ ను ఓడించడానికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వచ్చేది తెదేపా సర్కారే కాబట్టి.. వారికేం నష్టం లేదు. అదే సమయంలో- వైసీపీ మళ్లీ సర్కారు ఏర్పాటుచేస్తుందని వారికి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా.. పవన్ గెలిస్తే ఎంత, ఓడిపోతే ఎంత? జగన్ సర్కారు మళ్లీ ఏర్పడినట్లయితే.. పవన్ సభలో ఉంటే మాత్రం ఏం చేయగలరు? ఆయన గొంతుక ఉండకూడదని అనుకుంటున్నారట.

పవన్ ఎమ్మెల్యేగా ఓడిపోయినంత మాత్రాన ఆయన గొంతుక మూగబోతుందా? బయట నిల్చుని అరిచేది కాస్తా సభలో కూర్చుని అరుస్తారు అంతే కదా! మరి ఆయనను ఓడించడానికి ఆయన భ్రమపడుతున్నట్టుగా వంద, నూటయాభై కోట్ల రూపాయలు వారు ఎందుకు ఖర్చు పెట్టాలి? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.

కాబట్టి పవన్ ఈ అతిశయమైన, హైప్ క్రియేట్ చేసుకునే మాటలు మానేసి వాస్తవంలో బతకాలని ప్రజలు సూచిస్తున్నారు.