నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ తమది అని చంద్రబాబునాయుడు ఘనంగా చెప్పుకుంటారు. కానీ.. ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీ తరఫున బరిలో దించడానికి సరైన అభ్యర్థులు అంత సీనియర్ పార్టీలో ఆయనకు ఎవ్వరూ కనిపించరు.
ఏ ఇతర పార్టీ నుంచి ఏ నాయకుడు ఫిరాయించి, తమ పార్టీలో చేరుతాడా? ఏ కొత్త నాయకుడితో ప్యాకేజీ మాట్లాడుకుందామా? అని ఎదురుచూస్తూ ఉంటారు. బయటినుంచి వచ్చిన వారికి హఠాత్తుగా టికెట్లు దక్కుతాయి. ఆయన చెప్పుకునే రికార్డుల ప్రకారం .. నలభయ్యేళ్ల పైబడి పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న వారికీ, జెండా మోస్తున్న వారికీ ఖాళీ చెయ్యి మిగులుతుంది.
ఇప్పుడు ఎంపీ టికెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు ఫైనలైజ్ చేసిన పేర్లను గమనిస్తే మనకు ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. తెదేపాను చంద్రబాబు ఎంత గతిలేని పార్టీగా తీర్చిదిద్దారో అందరికీ తెలుస్తుంది.
తెలుగుదేశం ప్రస్తుతం పొత్తులు పెట్టుకున్న నేపథ్యంలో 17 ఎంపీ స్థానాలకు మాత్రం పోటీచేస్తోంది. కానీ, తమాషా ఏంటంటే, ఆ నియోజకవర్గాల్లో కూడా మోహరించడానికి వారికి అభ్యర్థులు లేరు. ఈ 17 స్థానాల్లో ప్రస్తుతానికి 9 స్థానాలను ఫైనలైజ్ చేసినట్టుగా పచ్చమీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ 9 స్థానాల్లో నాలుగింటిని.. జస్ట్ ఇప్పుడు కొన్ని రోజులు, వారాల కిందట వచ్చి పార్టీలో చేరిన వైసీపీ ఫిరాయింపు నేతలకు టికెట్లు కట్టబెడుతున్నారు.
చంద్రబాబు ప్రస్తుతానికి తుదిరూపు ఇచ్చిన 9 స్థానాల జాబితాలో.. విజయవాడ- కేశినేని చిన్ని, శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు, గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట- లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు- మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అనంతపురం- జేసీ పవన్ రెడ్డి, హిందూపురం- బీకే పార్థసారధి, నంద్యాల- బైరెడ్డి శబరి ఉన్నారు.
వీరిలో రామ్మోహన్, బికె పార్థసారథి, కేశినేని చిన్ని మాత్రమే తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారు. పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చి టికెట్ దక్కించుకున్న ఎన్నారై, జేసీ పవన్ రెడ్ది సంగతి సరే- విభజన తర్వాత కాంగ్రెస్ నాయకుల వలసల్లో భాగంగా తెలుగుదేశంలో చేరిన కుటుంబం వారిది. ఈ అయిదుగురిలోనే ఇలా ఉంది. మిగిలిన నలుగురిలో ముగ్గురు అభ్యర్థులు అచ్చంగా ఇప్పుడు వైసీపీ నుంచి జంప్ చేసి వచ్చిన వారు.
కృష్ణదేవరాయలు, రాఘవరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో పొసగక ఇక్కడికి వచ్చారు. రాగానే చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నారు. బైరెడ్డి శబరి అక్కడ బిజెపి నాయకురాలిగా ఉంటూ, హఠాత్తుగా తెదేపాలోకి జంప్ చేశారు.
ఈ నాయకులు రాకపోతే తెదేపా పరిస్థితి ఏమిటి? సొంతంగా ఆ పార్టీకి అభ్యర్థులే లేరా? అంతటి మొనగాళ్లు ఉంటే.. ఇప్పుడు వారికందరికీ టికెట్లు ఇవ్వకుండా చంద్రబాబు నట్టేట ముంచేసినట్టేనా? అనే ప్రశ్నలు పార్టీలో, ప్రజల్లో తలెత్తుతున్నాయి.