ఈ తీర్పుతో జగన్ మీద కేసులన్నీ కొట్టేయొచ్చు

ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్. అది న్యాయసమ్మతమే అని ఒక వర్గం, కాదు తప్పని మరొక వర్గం వాదిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇది ముమ్మాటికీ న్యాయసమ్మతం కాదంటున్నారు. ఇందులో…

ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్. అది న్యాయసమ్మతమే అని ఒక వర్గం, కాదు తప్పని మరొక వర్గం వాదిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇది ముమ్మాటికీ న్యాయసమ్మతం కాదంటున్నారు. ఇందులో క్విడ్-ప్రో-కో లు, బెదిరింపులు ఉంటాయని ఒక బలమైన వాదన. 

అలాగని ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని రద్దు చేస్తే దొంగదారిలో ఆ డబ్బు పార్టీలకి చేరుతుందని, కనుక ఆ బ్లాక్ మనీని అరికట్టడానికి ఈ ఎలోక్టరల్ బాండ్స్ ఒక మార్గమని అంటున్నవారున్నారు. కొందరు కేంద్ర మంత్రులు కూడా ఈ విషయంపై ఏకాభిప్రాయంతో ఉన్నారు.

అసలేమిటీ బాండ్స్? ఎందుకీ గొడవ? తెలిసినవారికి సరే! తెలియని వారి కోసం కాస్త చెప్పుకుందాం. 

ప్రతి ఎలక్షన్ ఖర్చుతో కూడుకున్నదే. ప్రతి పార్టీకి డబ్బు కావాల్సిందే. ఆ డబ్బు ఎలా వస్తుంది? విరాళాల రూపంలో రావాలి. మరి పార్టీ ఫండ్ పేరుతో విరాళాలు ఎవరిస్తారు? పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఇవ్వాలి. వాళ్లైనా ఎందుకిస్తారు? ఫలానా పార్టీ అధికారంలోకి వస్తే ఫలానా కాంట్రాక్ట్ తీసుకోవడానికి ఉపయోగపడతారనే ఆలోచనతోనే ఇస్తారు. 

ఉదాహరణకి ఒక పెద్ద వ్యాపరవేత్త ఉన్నాడు. అతనొక రాజకీయ నాయకుడు కూడా. తనకున్న పరిచయాలతో రూ 500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒకటి పొందగలిగాడు. ఆ యాక్టివిటీ మొదలుకాకపోయినా వెంటనే అధికారపార్టీకి రూ 40 కోట్ల రూపాయల విరాళమిచ్చి ఎలక్టోరల్ బాండ్ తీసుకున్నాడు. అంటే ఏదో లోపాయికారిగా ఇచ్చిన విరాళంలా కాకుండా అఫీషియల్ గా ఆన్-రికార్డ్ ఇచ్చిన విరాళమన్నమాట. ఇతనికి ఆన్-పేపర్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఇచ్చాడు. లేకపోయినా ఆ ఆశతో ముందే విరాళాలిస్తారు చాలామంది. 

అటువంటి ఆలోచన లేకపోయినా, ఫలానా పార్టీ మీద ఆసక్తి అస్సలు లేకపోయినా, రాజకీయాల జోలికి వెళ్లడమెందుకనే ఆలోచన ఉన్నా విరాళాలు ఇవ్వరు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బలవంతంగా ఇవ్వాల్సిన అవసరమేం లేదు. ఇష్టపడో, ఆశపడో ఇవ్వడంలో తప్పూ లేదు. 

కానీ ఇక్కడే వస్తోంది చిక్కు. అధికారంలో లేని పార్టీలు జోలె పట్టి అడిగితే ఇచ్చే వాళ్లు ఇస్తుంటారు. కొందరు ఇవ్వరు. కొందరు ఇచ్చినా మొక్కుబడిగా కాస్త విదిలించి “మమ” అనిపించొచ్చు. 

కానీ అధికార పార్టీ విషయం అలా కాదు కదా. 

అడుగొచ్చు, ఇవ్వకపోతే బెదిరించొచ్చు! 

అయినా ఇవ్వకపోతే ఈడీ రైడ్లు జరగొచ్చు. ఆ వెంటనే విరాళమిచ్చి ఎలక్టోరల్ బాండ్ తీసుకుంటే వదిలేయొచ్చు. 

ఈ తరహా కార్యక్రమాలు కొన్ని జరిగాయని ఒక వర్గం ఆరోపణ. 

మామూలుగా ఫలానా కంపెనీ ఫలానా పార్టీకి ఫండ్ ఇచ్చిందంటే తప్పేమీ లేదు. కానీ ఈడీ రైడ్ జరిగిన పిమ్మటే విరాళమిచ్చిందంటే అనుమానించాల్సిందే కదా! అది ఎక్స్టార్షన్ కావొచ్చు కదా అనేది ఇక్కడ వాదన. 

అయితే సదరు కంపెనీ వ్యక్తి తన స్టేట్మెంటులో ధృవపరిచే దాకా అది డబ్బుగుంజే ప్రయత్నమని ఎలా చెప్తాం అనేది ప్రతివాదన. 

ఇలాంటి వాదప్రతివాదనలు జరుగుతున్నాయి. 

ఒకవేళ ఇది తప్పని తేలి ఆ రకంగా సుప్రీం తీర్పు వస్తే పైన చెప్పుకున్నట్టు, అన్నేసి కోట్లు ఇతర గ్రే రూట్స్ ద్వారా పార్టీలని చేరతాయి. ఎందుకంటే డబ్బు అవసరం. బ్లాక్ మార్కెట్ దందా, దొంగనోట్ల పర్వం ఇవన్నీ ఎదురవచ్చు. ఇన్నేళ్లుగా చూస్తున్న విషయాలే ఇవన్నీ. అదే కొనసాగుతూ ఉంటుంది ఇక ముందు కూడా. 

అదే తప్పు కాదని తీర్పొస్తే కథ వేరేలా ఉంటుంది. ఎలోక్టారల్ బాండ్స్ రూపంలో విరాళాలు అంటే అంతా వైట్  మనీ ట్రాన్సాక్షనే. ఒక రకంగా చూస్తే లంచమో, లాంఛనమో..ఎలా అనుకున్నా సరే..దానిని లీగలైజ్ చేసినట్టు. వేలాది, లక్షలాది కోట్లు బ్యాంకుల ద్వారానే చేతులు మారతాయి. ఆ డబ్బంతా ఎకానమీలో సర్క్యులేట్ అవుతుంది. ప్రజలకి కూడా క్యాష్ రూపంలో కాకుండా ఆయా పార్టీలు ఫోన్ పే ద్వారా ఎమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక సర్వస్వం లీగలైజ్ అయిపోయినట్టే. కానీ ఇది ఎంతవరకు సబబు అనేది డిబేట్. 

ఒకవేళ ఇదే జరిగితే అసలిక “క్విడ్ ప్రో కో” మీద కేసులే ఉండవు. జగన్ మోహన్ రెడ్డి మీద కేసులన్నీ కొట్టేయొచ్చు. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ కథకి, జగన్ కథకి పెద్ద తేడా లేదు. ఇక్కడ బాండ్స్, అక్కడ కంపెనీల్లో పెట్టుబడులు..అంతే తేడా! తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పెట్టుబడులు పొందాడు అనడానికి ఉండదు..ఎందుకంటే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో అధికార పార్టీ ఎదుర్కొంటున్న అభియోగం అదే కనుక. 

నైతికంగా తప్పు అనుకునేవి ఒక్కోసారి న్యాయసమ్మతమవుతాయి. 

న్యాయసమ్మతమే అనుకునేవి ఒక్కోసారి వాదనాంశాలవుతాయి. 

వాదనాంశాలుగా ఉన్నవి కొన్ని సడెన్ గా నిర్వివాదాంశాలుగా మారొచ్చు.

అవసరార్ధం అన్యాయాలు న్యాయాలైపోవచ్చు. 

కాలక్రమంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. 

ఉదాహరణకి.. మద్యపానం అనారోగ్యమని తెలుసు. ప్రజల ఆరోగ్యం కాపాడడం ప్రభుత్వధర్మం. కానీ మద్యం లేనిదే అబ్కారీ వ్యవస్థ లేదు. అది లేనిదే ప్రభుత్వానికి డబ్బు రావడంలేదు. అందుకే మద్యపాననిషేధం అని అప్పట్లో ఎన్.టి.ఆర్ కొన్నాళ్లు నడిపినా తర్వాత ఎత్తేయాల్సి వచ్చింది. ఏది నైతికం, ఏది న్యాయం, ఏది అవసరం..అంటే ఏం చెప్పగలం? అలాగే ప్రతీ విషయమూను! 

చూడాలి..ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం తీర్పు ఏమొస్తుందో!

శ్రీనివాసమూర్తి