సీటు ప్రకటించుకున్న సీనియర్!

ఏ పార్టీ అయినా తమ అభ్యర్ధి ఫలానా వారే అని చెప్పి జాబితా ప్రకటించాలి. కానీ టీడీపీలో ఉంటూ రెండు సార్లు రాజ్యసభ సీటు అందుకున్న సీఎం రమేష్ ఆ మీదట బీజేపీలో చేరి…

ఏ పార్టీ అయినా తమ అభ్యర్ధి ఫలానా వారే అని చెప్పి జాబితా ప్రకటించాలి. కానీ టీడీపీలో ఉంటూ రెండు సార్లు రాజ్యసభ సీటు అందుకున్న సీఎం రమేష్ ఆ మీదట బీజేపీలో చేరి అక్కడ అధికార పార్టీ మెంబర్ అయ్యారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తోంది. దాంతో ఆయన లోక్ సభ ద్వారానే ఈసారి పార్లమెంట్ కి వెళ్లాల్సి ఉంది. దాంతో ఆయన తమ సొంత జిల్లాలో రాజం పేట వంటి లోక్ సభ సీటు వదిలేసి ఉమ్మడి విశాఖ జిల్లా వైపు వస్తున్నారు.

విశాఖ ఎంపీ అడిగారు, కానీ విశాఖ ఎంపీ సీటు టీడీపీకే పొత్తులో వెళ్తోంది. దాంతో అనకాపల్లి అయినా ఓకే అంటున్నారు. అంతటితో ఆగకుండా ఆయన అనుచరులు లేక అభిమానులో తెలియదు కానీ అనకాపల్లి  ఎంపీ  కూటమి అభ్యర్ధి సీఎం రమేష్ అని ఫ్లెక్సీలు కట్టేశారు. రమేష్ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధి అని కూడా రాసి మరీ రాజకీయ రచ్చకు తెర తీశారు.

విశాఖ బీజేపీ చూస్తే ఇంకా విశాఖ సీటు మీద ఆశలు వదులుకోలేదు. ఆ పార్టీ నేతలు విశాఖ సీటు తమ పార్టీకి సెంటిమెంట్ అని దాన్ని బీజేపీకే కేటాయించేలా చూడాలని హై కమాండ్ ని కోరుతున్నారు. విశాఖ నుంచి పోటీ చేద్దామని జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. ఆయన ఇటీవల ఢిల్లీ నుంచి విశాఖ వస్తూ నగరంలో బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించి తన బల ప్రదర్శన ఏంటో చూపించారు.

అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో టీడీపీలోని ఆశావహులు కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారు ఎక్కడా తగ్గడంలేదు. నాన్ లోకల్స్ కి సీటు ఇవ్వవద్దు అని కూడా కొందరు తమ్ముళ్ళు అంటున్నారు. తనకు విశాఖ ఎంపీ సీటు కావాలని హై కమాండ్ ని కోరాను అని ఇటీవల విశాఖ వచ్చిన సందర్భంగా రమేష్ మీడియా ముందు చెప్పారు. ఇపుడు అనకాపల్లిలో ఆయన పేరిట ఫ్లెక్సీలు వెలవడంతో ఏ సీటు అయినా ఓకే తనకు కావాల్సింది పోటీ చేసి పార్లమెంట్ కి వెళ్లడమేనా అని అంతా అంటున్నారు.