పెద్దాయనకు కీలక పదవి ఇచ్చిన వైసీపీ!

గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి కీలక పదవిని వైసీపీ అధినాయకత్వం కట్టబెట్టింది. గాజువాకలో తన కుమారుడికి సీటు ఇవ్వాలని చాలా కాలంగా నాగిరెడ్డి కోరుతున్నారు. అయితే చివరికి అక్కడకు మంత్రి గుడివాడ అమర్నాధ్…

గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి కీలక పదవిని వైసీపీ అధినాయకత్వం కట్టబెట్టింది. గాజువాకలో తన కుమారుడికి సీటు ఇవ్వాలని చాలా కాలంగా నాగిరెడ్డి కోరుతున్నారు. అయితే చివరికి అక్కడకు మంత్రి గుడివాడ అమర్నాధ్ ని తీసుకుని వచ్చి పోటీ చేయిస్తున్నారు.

ఇది తిప్పల వర్గంలో కొంత అసంతృప్తికి కారణం అయింది అని అంటున్నారు. 2009 నుంచి తిప్పల గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు. ఆయనకు అప్పట్లో వైఎస్సార్ టికెట్ ఇచ్చారు. 2014, 2019లలో వైసీపీ రెండు సార్లు టికెట్ ఇస్తే 2019లో ఆయన గెలిచి చూపించారు. డెబ్బయ్యేళ్లకు చేరువలో ఉన్న తిప్పల ఈసారి తన వారసుడు దేవాన్ రెడ్డికే టికెట్ అని గాఢంగా నమ్మి ఉన్నారు.

కానీ ఇపుడు రాజకీయం మారింది. అయితే తిప్పల అంటే ఎంతో అభిమానం చూపించే వైసీపీ అధినాయకత్వం ఆయనను కోరి పిలిపించుకుని కీలక హామీలే ఇచ్చింది అని అంటున్నారు. మరోసారి అధికారంలోకి వైసీపీ రావడం ఖాయమని కచ్చితంగా ఎమ్మెల్సీ వంటి పదవితో గౌరవిస్తామని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయనను విశాఖ వైసీపీ రీజనల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ గా కీలక పదవిని కట్టబెట్టింది. ఆయన విశాఖ అనకాపల్లి, అల్లూరి జిల్లాలలో పార్టీ విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది. పార్టీ తరఫున పెద్దగా ఉంటూ ఎన్నికల్లో ప్రముఖ పాత్రను పోషించేలా ఆయనకు అవకాశం ఇచ్చారు అని అంటున్నారు. 

తిప్పలకు గాజువాకలో మంచి బలం ఉంది. అది దశాబ్దాలుగా వారి కుటుంబం సంపాదించుకుంది. ఆయన వర్గం పూర్తి స్థాయిలో పనిచేసి వైసీపీ అభ్యర్ధిని గాజువాకలో గెలిపించాలని అధినాయకత్వం ఆదేశించింది. వైసీపీలో వర్గ పోరు అయితే దాదాపుగా సమసిపోయింది అని అంటున్నారు. అంతా ఐక్యంగా కదలి వస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా గాజువాకలో టీడీపీకి ఇది ఇబ్బందికరమే అని అంటున్నారు.