సముద్రం వంగదు, పర్వతం పడుకోదు.. ఇలాంటి త్రివిక్రమ్ విరచిత ప్రాసలెన్నో ప్రయోగించారు జనసేన అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్! మరి పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఇప్పుడు తను ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలా లేదా కాకినాడ ఎంపీగా బరిలోకి దిగాలా అనేది అమిత్ షా ఆదేశానుసారం అని ప్రకటించారు పవన్ కల్యాణ్! ఒక పార్టీ అధినేత, ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి రాజకీయం చేస్తున్న ఈ హీరోగారు.. ఆఖరికి తను ఎంపీగా పోటీ చేయాలా లేదా ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలా అనేది.. బీజేపీ నేత ఆదేశాలనుసారం అంటున్నారు!
ఆఖరికి ఇలా తయారైంది పవన్ కల్యాణ్ రాజకీయం! తన పర్వతాన్ని, తను సముద్రాన్ని అని చెప్పుకు తిరుగుతూ.. పోటీకి మాత్రం మరో పార్టీ నేత ఆదేశాలు ఇవ్వాల్సిన అగత్యం ఉందని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు! తను చెప్పే మాటలకూ, తన రాజకీయ వ్యక్తిత్వానికి ఏ మాత్రం పొంతన లేదని పవన్ స్వయంగా రుజువు చేసుకుంటున్నారు!
జనసేన ఎక్కడ పోటీ చేయాలనేది చంద్రబాబు చెబుతారు! జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది చంద్రబాబు చెబుతారు! జనసేన తరఫున ఎవరు పోటీ చేయాలనేది కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నారు. అలా చంద్రబాబు నిర్ణయానుసారం మొదటేమో 24 సీట్లలో పోటీ అని, గాయత్రి మంత్రమని, ఆఖరికి 21 సీట్లలో పోటీకి పరిమితం అయ్యారు.
మరి ఆ సీట్లలో పోటీ అయినా జరిగే పనేనా? నామినేషన్లకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఆ కోటాలో చంద్రబాబు ఎన్ని చోట్ల పోటీకి పరిమితం చేస్తారో చూడాల్సి ఉంది! మరి చంద్రబాబు ఆదేశాలనుసారం జనసేన రాజకీయం నడుస్తుంటే, జనసేన అధినేత రాజకీయం మాత్రం అమిత్ షా ఆదేశాలనుసారం నడుస్తుందట!
తను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడమా, లేదా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడమా అనేది అమిత్ షా డిసైడ్ చేస్తారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకోవడం ఆయన రాజకీయ పతనావస్థలో పీక్స్ అనుకోవచ్చు! పార్టీ పెట్టి పదేళ్లు అయ్యాకా.. తను స్వయంగా ఎక్కడ పోటీ చేయాలో కూడా వేరే పార్టీ వాళ్ల ఆదేశాల కోసం వేచి చూడాల్సి రావడం పవన్ కల్యాణ్ రాజకీయ దౌర్బాగ్యం! ఈయన ఇంకోరి స్థాయి గురించి అవాకులు చవాకులు పేల్తారు!