తను ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించుకున్న కొన్ని గంటల్లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరంలో మార్పు కనిపిస్తోంది! ఏకంగా లక్ష మంది కాపు ఓట్లు నియోజకవర్గాన్ని తనకు సేఫెస్ట్ గా ఎంచుకున్నట్టుగా కనిపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీకి కూడా తర్జనభర్జనల్లో ఉన్నట్టున్నారు!
తను పిఠాపురం నుంచి పోటీలో ఉన్నట్టేనని చెప్పుకుంటూనే.. అమిత్ షా ఆదేశిస్తే తను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించడం విశేషం!
దీంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా లేదా అనేది మళ్లీ సందేహాస్పదమైన అంశంగా మారింది! గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఈ సారి ఎమ్మెల్యే అవుతారని, సీఎం అయిపోతారని ఆయన వీరాభిమానులు ఆశిస్తున్నారు!
ఓజీ సినిమా విడుదల నాటికి పవన్ సీఎంగా ఉంటారని, తన సినిమా అదనపు షోలకు తనే పర్మిషన్ ఇస్తూ జీవో ఇస్తారని పవన్ వీరాభిమానులు కొన్నాళ్ల కిందట సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ముచ్చట అంతా సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది.
కేవలం 21 అసెంబ్లీ సీట్లకు జనసేన పోటీ చేస్తే.. పవన్ కల్యాణ్ కలలో కూడా సీఎం అయ్యే ఛాన్సులు లేవని వీరాభిమానులకు కూడా పిచ్చ క్లారిటీ వచ్చింది. తన పార్టీని కేవలం 21 సీట్లలో పోటీకి పరిమితం చేసిన పవన్ ఇప్పుడు స్వయంగా తనే ఎమ్మెల్యే గా బరిలోకి దిగడం గురించి వెనుకడుగు వేస్తున్నట్టుగా ఉన్నారు!
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా బరిలో దిగకపోతే అది జనసేనకు మరో పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. పవన్ ఎంపీగా గెలవడం, గెలవకపోవడం సంగతలా ఉంటే.. జనసేన తరఫు నుంచి బరిలోకి దిగే అభ్యర్థుల విజయావకాశాల మీద పవన్ పోటీ చేయకపోవడం అనేది గట్టి నెగిటివ్ ఇంపాక్ట్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.