నేను వైసీపీ కోవ‌ర్టును కాదు

తాను వైసీపీ కోవ‌ర్టును కాద‌ని చిత్తూరు ఎమ్మెల్యే జంగాల‌ప‌ల్లి శ్రీ‌నివాసులు అలియాస్ ఆర‌ణి శ్రీ‌నివాసులు స్ప‌ష్టం చేశారు. తిరుప‌తిలో ఆయ‌న జ‌న‌సేన ఎన్నిక‌ల కార్యాల‌యాన్ని మంగ‌ళ‌వారం ప్రారంభించారు. వైసీపీ నుంచి జ‌న‌సేన‌లో చేరిన ఆయ‌న‌కు…

తాను వైసీపీ కోవ‌ర్టును కాద‌ని చిత్తూరు ఎమ్మెల్యే జంగాల‌ప‌ల్లి శ్రీ‌నివాసులు అలియాస్ ఆర‌ణి శ్రీ‌నివాసులు స్ప‌ష్టం చేశారు. తిరుప‌తిలో ఆయ‌న జ‌న‌సేన ఎన్నిక‌ల కార్యాల‌యాన్ని మంగ‌ళ‌వారం ప్రారంభించారు. వైసీపీ నుంచి జ‌న‌సేన‌లో చేరిన ఆయ‌న‌కు కూట‌మి త‌ర‌పున తిరుప‌తి టికెట్ ద‌క్కింది. బ‌లిజ సామాజిక వ‌ర్గంతో పాటు, ఆర్థికంతా స్థితిమంతుడు కావ‌డంతో తిరుప‌తి సీటు ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జరుగుతోంది.

అయితే ఆయ‌న స్థానికేత‌రుడ‌ని, జంగాల‌ప‌ల్లికి స‌హ‌క‌రించేది లేదంటూ జ‌న‌సేన‌తో పాటు టీడీపీలోని టికెట్ ఆశావ‌హులు మీడియాకెక్కి ర‌చ్చ చేశారు. దీంతో టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధిష్టానాలు సీరియ‌స్ అయ్యాయి. జంగాల‌ప‌ల్లి రెండు రోజుల క్రితం తిరుప‌తిలో ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ఇవాళ ఆయ‌న నూత‌న కార్యాల‌య ప్రారంభం సంద‌ర్భంగా మాట్లాడుతూ తిరుప‌తి వాసుల‌కు సేవ చేసే భాగ్యం క‌ల్పించాల‌ని కోరారు.

తిరుప‌తి టికెట్ ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు. 24 గంట‌లూ అందుబాటులో వుంటాన‌న్నారు. స్థానికేత‌రుడ‌ని త‌న‌ను అన‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. 2009లోనే తిరుప‌తిలో ఇల్లు కొన్నాన‌ని ఆయ‌న గుర్తు చేశారు. తిరుప‌తి ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా వుంటూ వ‌స్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

కానీ త‌న‌పై ఉద్దేశ పూర్వ‌కంగానే దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అలాగే వైసీపీ కోవ‌ర్టుగా ఆరోపించ‌డం త‌గ‌ద‌న్నారు. తాను నిజ‌మైన జ‌న‌సేన సైనికుడిన‌ని ఆర‌ణి అన్నారు. త‌న‌పై జ‌న‌సేనాని పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌న‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.