తుపాకుల‌కి పూచే డాల‌ర్లు

అమెరికా, డాల‌ర్ డ్రీమ్స్, భూమ్మీద స్వ‌ర్గం. ఎగిరిపోవాలి, కొత్త జీవితం, ఏదీ మునుప‌టిలా వుండ‌దు. అంతా మారిపోతుంది. రంగుల రెక్క‌ల‌తో ఇంద్ర‌ధ‌న‌స్సు అందుకోవ‌చ్చు. ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మీయుల జాత‌ర‌. క‌న్నీళ్లు, వీడ్కోళ్లు, కౌగిలింత‌లు. లోప‌లికి వెళుతూ…

అమెరికా, డాల‌ర్ డ్రీమ్స్, భూమ్మీద స్వ‌ర్గం. ఎగిరిపోవాలి, కొత్త జీవితం, ఏదీ మునుప‌టిలా వుండ‌దు. అంతా మారిపోతుంది. రంగుల రెక్క‌ల‌తో ఇంద్ర‌ధ‌న‌స్సు అందుకోవ‌చ్చు. ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మీయుల జాత‌ర‌. క‌న్నీళ్లు, వీడ్కోళ్లు, కౌగిలింత‌లు. లోప‌లికి వెళుతూ వుంటే చివ‌రిసారి తిరిగి చూసిన‌ప్పుడు క‌ళ్లు వాన మేఘాలే క‌దా!

ప‌ల్లెల్లో నీళ్లు రాక‌పోయినా డాల‌ర్లు వ‌స్తున్నాయి. ఇళ్ల రూపం మారుతోంది. పొలాల గ‌ట్లు పెరుగుతున్నాయి. ర‌చ్చ‌బండ‌ల్లో మీ వాడు “ఏ స్టేట్” అని ప‌ల‌క‌రింపులు. అమ్మానాన్న‌ల‌కి ఆరు నెల‌ల ప్ర‌యాణం త‌ప్ప‌నిస‌రి త‌గులుతుంది. విమానంలో గంట‌లు గంట‌లు ఎన్నిసార్లు నిద్ర‌పోయినా, మేల్కొన్నా అమెరికా రాదు.

ఎయిర్‌పోర్ట్‌కి పిల్ల‌లు వ‌స్తారు. రోడ్లు, మ‌నుషులు, భాష అన్నీ ఆశ్చ‌ర్య‌మే. క‌మ్యూనిటీ జైల్లోకి ప్ర‌వేశం. వారంలో ఐదు రోజులు చెక్క‌ల‌తో చేసిన ఇంటి గోడ‌ల‌కి అతికించిన క‌ళ్లు. దూరం వెళ్ల‌కుండా ఇంటి చుట్టూ వాకింగ్‌. వీకెండ్‌లో ప్ర‌యాణాలు. ఫొటోల్ని ఫేస్‌బుక్‌లో పెడితే లైక్‌లే లైక్‌లు. కామెంట్స్ వ‌ర‌ద‌.

ఒక రోజు తిరుగు ప్ర‌యాణం. కొంత కాలం అమెరికా క‌బుర్లు, డాంబికాలు. వీడియోలో మాత్ర‌మే క‌నిపించే పిల్ల‌లు.

పిల్ల‌లు ఇల్లు కొంటారు. సాంప్ర‌దాయ పూజ‌లు. లైవ్‌లో వీడియో. డాల‌ర్ల‌కి పిల్ల‌లు అమ్ముడుపోయారా? అమ్మానాన్నే అమ్మేశారా? మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఒక రోజు వ‌స్తుంది. డాల‌ర్ల దేశంలో తుపాకులు జొన్న కంకుల్లా మొలుస్తాయ‌ని తెలుస్తుంది. న్యూయార్క్‌లో కాల్పులు జ‌రిగితే నూజివీడులోని త‌ల్లి ఉలిక్కి ప‌డుతుంది. టెక్సాస్‌లో గ‌న్ పేలితే టేకుల‌ప‌ల్లిలోని అమ్మానాన్న క‌ళ్లు త‌డుస్తాయి.

జాక్స‌న్‌విల్లీ, ప్లోరిడాలోని అంద‌మైన న‌గ‌రం. చుట్టూ బీచ్‌లు. నేనూ చూసాను. తెల్ల‌టి బూడిద‌లాంటి ఇసుక‌. స‌ముద్ర‌పు కాకుల సంగీతం. నా కొడుకు కోడ‌లు ఆదివారం సాయంత్రం బీచ్‌కు వెళ్లారు. బీచ్ బార్‌లో ఉన్మాది తుపాకి మోగింది. ఒక‌రు చ‌నిపోయారు. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు.

బీచ్ మ‌రో చివ‌ర ఉన్న మా పిల్ల‌ల‌కి ఇది తెలియ‌డానికి కొంచెం టైమ్ ప‌ట్టింది. ఏం కాలేదు, క్షేమ‌మే.

కానీ చ‌నిపోయిన వ్య‌క్తి , చావుబ‌తుకుల్లో ఉన్న ఇద్ద‌రు కూడా ఆదివారం సాయంత్రం ఆనందంగా ఉండ‌డానికే వ‌చ్చారు. వాళ్లెవ‌రో నాకు తెలియ‌క‌పోవ‌చ్చు. అదే నేల మీద మా అబ్బాయితో క‌లిసి నిన్న‌టి వ‌ర‌కు జీవించిన వాళ్లే క‌దా! క‌డుపు చేత ప‌ట్టుకుని వ‌చ్చిన మెక్సిక‌న్ కార్మికులు కావ‌చ్చు. దొంగ దారిలో ప్రాణాల‌కు తెగించి స‌రిహ‌ద్దులు దాటిన వాడు కావ‌చ్చు. గ‌న్‌తో పాటు పుట్టిపెరిగిన అమెరిక‌న్లు కూడా కావ‌చ్చు. ఎప్పుడు ఎవ‌రి చేతుల్లో తుపాకి పేలుతుందో తెలియ‌ని ఉన్మాద దేశం.

ప్ర‌పంచ‌మే తుపాకి నీడ‌లో జీవిస్తున్న కాలం. కత్తి మొన‌తో చ‌రిత్ర రాస్తున్న కాలం. ఎప్పుడైనా ఏమైనా జ‌రిగే కాలం. కొంచెం ద‌య‌తో జీవించండి. త‌న‌లోని విషం వ‌ల్ల పాముకి హాని లేక‌పోవ‌చ్చు. కానీ జీవిత‌మంతా విషాన్ని మోస్తూ జీవించ‌డం వంద మ‌ర‌ణాల‌తో స‌మానం క‌దా!

జీఆర్ మ‌హ‌ర్షి