మరోసారి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా వార్తల్లోకెక్కారు. జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్‌తో వంగవీటి రాధా గంటసేపు భేటీ కావడం చర్చనీయాంశమైంది. అధికారం ఉన్నచోట రాధా వుండరని అంటుంటారు. ఆవేశపరుడిగా ముద్రపడిన రాధా రాజకీయంగా తరచూ తప్పటడుగులు వేస్తుంటారు.
గత ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని వైఎస్ జగన్ ఇచ్చిన ఆఫర్‌ను వంగవీటి రాధా తిరస్కరించారు. వైసీపీలో ఉన్నప్పుడు విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. వైసీపీని వీడుతూ వైఎస్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రిని చంపిన పార్టీలో చేరి, అప్రతిష్టపాలయ్యారనే చర్చకు నాడు తెరలేపారు. గతంలో జగన్ చెప్పినట్టు విని వుంటే, ఎంపీగా ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించే వారు.
టీడీపీలో చేరినప్పటికీ ఎక్కడా పోటీ చేయలేదు. టీడీపీలో రాధా ఉన్నారనే మాటే తప్ప, ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. తాజాగా నాదెండ్ల మనోహర్‌తో భేటీతో జనసేనలో చేరుతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. సాంకేతికంగా టీడీపీ నాయకుడైన వంగవీటి రాధాను చేర్చుకోవడం వల్ల జనసేనకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
వైసీపీలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వంగవీటి రాధా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. వైసీపీలోనే ఆయన యాక్టీవ్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన డీలా పడ్డారు. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నప్పుడు, రెండు పార్టీల మధ్య నాయకుల మార్పిడి విమర్శలకు దారి తీస్తోంది. అదేదో టీడీపీ నాయకుడిగానే వంగవీటి రాధాకు ఏదైనా అవకాశం ఇవ్వొచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ నుంచి జనసేనలో వంగవీధి రాధా చేరడం వల్ల కొత్తగా వచ్చే బలం ఏంటో వారికే తెలియాలి.