ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు దక్కాయి. బీజేపీ ఇంత వరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అభ్యర్థుల ఎంపిక నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇచ్చే సీట్లపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీటు బీజేపీకి కేటాయిస్తారని విస్తృతమైన ప్రచారం జరిగింది. అయితే శ్రీకాళహస్తి నుంచి తమ పార్టీ తరపున బొజ్జల సుధీర్‌రెడ్డి బరిలో వుంటారని రెండో జాబితాలో చంద్రబాబు ప్రకటించారు. దీంతో బొజ్జల సుధీర్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు శ్రీకాళహస్తి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జనసేన ఇన్చార్జ్ కోటా వినుత తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంత వరకూ తనతో బొజ్జల సుధీర్‌రెడ్డి కనీసం ఫోన్లో కూడా మాట్లాడకపోవడంతో వినుత అసహనానికి లోనయ్యారు.
ఇదిలా వుండగా శ్రీకాళహస్తి సీటును టీడీపీకి కేటాయించినా, బీజేపీ ఇన్చార్జ్ కోలా ఆనంద్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో తిష్ట వేసి లాబీయింగ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తి సీటు సాధించే వరకూ ఢిల్లీ వదిలిరానని ఆయన అంటున్నట్టు అనుచరులు చెబుతున్నారు.
తమ నాయకుడు ఢిల్లీలో ఉన్నారని కోలా ఆనంద్ సన్నిహితులు తెలిపారు. టీడీపీకి కేటాయించినప్పటికీ, ఢిల్లీ పెద్దలతో చెప్పించి, ఒప్పించి తనకే ఇస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒకవేళ బీజేపీకి సీటు ఇవ్వకపోతే ఆయన మద్దతు ఎలా వుంటుందో చూడాలి.