ఒక వ్యవస్థను ఎన్ని రకాలుగా భ్రష్టుపట్టించవచ్చునో, ఆదర్శంగా ఉండవలసిన చోట వ్యవస్థీకృతంగా ఎన్ని విధాలుగా అరాచకత్వానికి అవినీతికి పాల్పడవచ్చునో అర్థం కావడానికి ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలే ఒక పెద్ద ఉదాహరణ.
11 వేల కోట్ల రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తం. ఈ దేశంలో పార్టీలకు అందిన విరాళాల విలువ అది. అంత పెద్దమొత్తంతో ఏం చేయవచ్చు అనే ప్రశ్న వేసుకుంటే ఎన్ని సమాధానాలైనా పుడతాయి. వృథాఖర్చులను లేకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పోలవరం వంటి ఒక పెద్ద ప్రాజెక్టునే కట్టవచ్చు. గ్రాఫిక్స్ మాయలను పక్కన పెడితే ఒక నగరాన్నే నిర్మించవచ్చు. కొన్ని కోట్ల మంది జీవితాల్లో శాశ్వతమైన ఉపాధి కల్పించగల పరిశ్రమలను స్థాపించవచ్చు. కొన్ని కోట్ల మందికి కొన్ని దశాబ్దాలకు పైబడి నిరంతర సేవలు అందించగల అద్భుతమైన విద్యాసంస్థలను ఏర్పాటుచేయవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆలోచనలైనా పంచుకోవచ్చు.
కానీ 11వేల కోట్లకు పైగా విరాళాలు తీసుకున్న పార్టీలు ఏం చేస్తున్నాయి? నాయకులు ప్రెవేటు జెట్ విమానాలలో తిరిగేందుకు ఖర్చు పెడుతున్నాయి. ప్రజాప్రతినిధులను బహిరంగ వేలం మార్కెట్లో కొంటూ, తమ పార్టీలో చేర్చుకుని ‘బలోపేతం’ అవుతున్నాయి! దేశమూ ప్రజలూ సమాజసేవా వంటి అనేకానేక పడికట్టు పదాలు మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే.. ఎన్నికల బాండ్ల ద్వారా తమ పార్టీకి అందిన విరాళాలతో సమాజహితాన్ని ఉద్దేశించిన ఏ ఒక్క కార్యక్రమం అయినా నిర్వహించిందా? అనే ప్రశ్న వేసుకుంటే యావత్ సమాజానికి సిగ్గు అనిపిస్తుంది.
ఎన్నికల బాండ్లు అనే వ్యవహారం చుట్టూ తాజాగా పెద్ద ప్రహసనమే నడుస్తోంది. పార్టీలు ఈ బాండ్ల రూపంలో అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు దండుకుంటే.. ఆ వివరాలను దేశప్రజలకు తెలిసేలాగా చేయడానికి సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. అనేక మార్లు ఆదేశించిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాక్షికంగా వివరాలు బయటపెట్టింది. పార్టీలకు మరక అంటకుండా డొంకతిరుగుడు వివరాలు అవి. ఏయే సంస్థలు/వ్యక్తులు ఎంత విలువైన ఎన్నికల బాండ్లు కొన్నారో చెప్పింది. ఏయే పార్టీలకు ఎంతెంత బాండ్లు ముట్టాయో చెప్పింది. ఏ పార్టీకి, ఏ సంస్థ ద్వారా ఎంత ముట్టినది మాత్రం దాచి పెట్టింది. ఆ వివరాలను కూడా బయటకు రాబట్టడానికి సుప్రీం కోర్టు మళ్లీ తన ఆదేశాల యుద్ధాన్ని కొనసాగించవలసి వస్తున్నది.
ఇదంతా ఒక ఎత్తు-
ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇచ్చిన వారి పేర్లను దాచిపెడుతూ.. ఆయా పార్టీలు చెబుతున్న కాకమ్మ కబుర్లు మరో ఎత్తు! ఇవన్నీ రాజకీయ పార్టీల అడ్డదారి సంపాదనలు. మామూలు పామర భాషలో లంచాలు. కానీ.. ఈ లంచాలకు కూడా వ్యవస్థీకృతంగా ఒక చట్టబద్ధమైన రూపం కల్పించారు. ఆ చట్టబద్ధమైన బాండ్ల ముసుగులో దండుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఇదంతా చర్చనీయాంశం అయ్యేసరికి ఎవరికి వారు జాగ్రత్త పడడానికి కథలు చెబుతున్నారు.
6986 కోట్ల రూపాయలు ఇలాంటి అడ్డదారుల్లో పొందిన భారతీయ జనతా పార్టీ, చాలా తెలివిగా చట్టపరమైన కారణాలనే చెబుతోంది. దేశంలో అందరికంటె అత్యధికంగా సొమ్ములు పొందిన పార్టీ ఇది. ఆ పార్టీది ఇంచుమించు ఏడువేల కోట్లరూపాయలతో నెంబర్ వన్ సంపాదన అయితే.. ఆ తర్వాత నెంబర్ టూ లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు రూ.1397 కోట్లు అందాయి. పాపం, జాతీయ పార్టీనే అయినప్పటికీ కాంగ్రెస్, టీఎంసీ కంటె వెనుకబడి 1334 కోట్ల వద్ద ఆగింది.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. మొదటిస్థానం బిజెపి ఏడువేల కోట్లకు, రెండో స్థానం టీఎంసీ 1400 కోట్లకు మధ్య సుమారు 5600 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. పైగా బిజెపికి అందిన బాండ్ల విలువ దేశంలోని దాదాపు అన్ని పార్టీలకు అందిన సదరు చందాల విలువ కంటె ఎక్కువే! కాబట్టి బిజెపి ఎంత వ్యవస్థీకృతంగా నిధులు పోగేస్తున్నదో అర్థమవుతోంది.
పేర్లు చెప్పడం నేరం అని 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, ఆదాయపు పన్ను చట్టం లకు జరిగిన సవరణల ప్రకారం చెప్పకూడదట. అసలు ఇలా పార్టీలను అడ్డదారుల్లో పోషించే దాతల వివరాలను రక్షించే ఉద్దేశంతోనే ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టారట. ఎన్నికల సంఘానికి పార్టీ రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు.
అంత బరితెగించి సమాధానం చెప్పేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు?
కొన్ని పార్టీలు చెబుతున్న సమాధానాలు చాలా కామెడీగా ఉన్నాయి. కోటిరూపాయల విలువ చేసే బాండ్లు తమకు పోస్టు ద్వారా వచ్చాయని, వాటిని పంపిన వారు కవరు మీద అడ్రసు రాయకపోవడం వలన ఎవరు ఇచ్చారో తెలియదని సమాజ్ వాదీ పార్టీ అంటోంది.
తెలుగుదేశం పార్టీ ‘దాతల వివరాలు మాదగ్గర అందుబాటులో లేవు’ అంటూ ఏదో ఆర్టీఐ పిటిషన్ కు సమాధానం ఇచ్చినట్టుగా మొక్కుబడిగా తప్పుకుంది. సెకండ్ ప్లేస్ టీఎంసీ వారిది ఇంకో కామెడీ. కొంత మంది వివరాలు గోప్యంగా ఉంచాలని కోరినందువల్ల చెప్పబోమని అంటూనే.. పార్టీ ఆఫీసులో ఉండే డ్రాప్ బాక్సులో చాలా మంది బాండ్లు వేసి వెళ్లిపోయారని కథ అల్లింది. అంటే పార్టీ ఆఫీసులో హుండీ పెట్టాం. హుండీలో బాండ్లు వేశారని చెబుతోందన్నమాట.
అలాగైతే ఎవరు ఎంత వేశారో చెప్పే పని లేదు కదా!! గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పదికోట్ల విలువైన బాండ్లు ఇచ్చారని, అతనెవరో తెలియదని బీహార్లోని జేడీయూ అంటోంది.
తమాషా ఏంటంటే.. అంతో ఇంతో తమిళ పార్టీలలో కొంత నిజాయితీ ఉంది. అధికారంలో ఉన్న డీఎంకే.. తమ పార్టీకి 77 శాతం నిధులు లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి వచ్చాయని చెప్పింది. ఈ ఫ్యూచర్ గేమింగ్ సంస్థ అందరి కంటె ఎక్కువ మొత్తం బాండ్లు కొన్న సంస్థ గా తేలడం గమనార్హం. అన్నాడీఎంకే కూడా తమకు అందిన 6 కోట్లలో 5 కోట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్కే నుంచి వచ్చినట్టు చెప్పింది.
చట్టబద్ధమైన అడ్డదారుల్లో డబ్బు పుచ్చుకోవడం మాత్రమే కాదు.. ఆ వివరాలు వెల్లడించడానికి చెబుతున్న కాకమ్మ కబుర్లలో కూడా ఈ పార్టీలు తమ దిగజారుడుతనాన్ని చాటుకుంటున్నాయి. ఎన్నికల వ్యవస్థలో ఎమ్మెల్యే, ఎంపీలుగా నెగ్గి ఈ దేశం కోసం చట్టాలు చేసే పదవుల్లో ఉండాలని ఆరాటపడే నాయకులు.. పదుల, వందల కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయడానికి వెనకాడకుండా జనం మీద వెదజల్లితే.. అడ్డదారుల్లో అవినీతితో వక్రమార్గంలో సంపాదించుకుంటూ ఉంటే చూసి మిన్నకుండడానికి ప్రజలు అలవాటుపడ్డారు. జడపదార్థాల్లా తయారవుతున్నారు.
ఇప్పుడు ప్రవచనాలు చెప్పే పార్టీలు లంచాలస్వరూపం బయటపడుతోంది.. వీటిని కూడా ప్రజలు ఇలాగే చూస్తూ ఉండిపోతారా? పార్టీలను అసహ్యించుకునే చైతన్యం వారిలో వస్తుందా? రాదా? పార్టీ ముసుగులో వందల వేల కోట్ల రూపాయల అక్రమార్జనలకు పాల్పడుతున్న పార్టీలు తాము ప్రజాసేవ చేయడానికే, దేశాన్ని రక్షించేందుకే జన్మ ఎత్తినట్టుగా చాటుకుంటూ ఉంటే ప్రజలు ఇంకా నమ్మే స్థితిలోనే ఉన్నారా? అనేది ప్రశ్న.
నాయకులు, పార్టీలు సిగ్గుపడకపోవచ్చు. కానీ ఇలాంటి పార్టీలను ఆరాధిస్తూ, నాయకులను పూజిస్తూ బతుకుతున్నందుకు ప్రజలు సిగ్గుపడాలి.