ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. కడప బరి నుంచి వైఎస్ వివేకా కుటుంబం తప్పుకుని, చాలా తెలివిగా ప్రవర్తించింది. పోటీ చేసి వుంటే ఏం జరిగేదో వివేకా కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కడప నుంచి షర్మిలను పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుండడం గమనార్హం. ఆమె రాక కోసం కడప ఎదురు చూస్తోంది.
షర్మిలకు గట్టిగా బుద్ధి చెబుదామని, ఆ సమయం ఎప్పుడొస్తుందా? అని కడప లోక్‌సభ నియోజకవర్గం ఎదురు చూస్తోంది. వైఎస్సార్ వారసుడిగా ఆయన తనయుడు వైఎస్ జగన్‌కు కడప ప్రజానీకం మొదటి నుంచి బ్రహ్మరథం పడుతోంది. వైఎస్ జగన్‌తో వ్యక్తిగత విభేదాలతో షర్మిల తెలంగాణ వెళ్లి వైఎస్సార్టీపీ పేరుతో సొంత రాజకీయ పార్టీ స్థాపించారు. రాజకీయంగా బలపడేందుకు షర్మిల శతవిధాలా ప్రయత్నించారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అలాగే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలపై షర్మిల ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి ఆలోచించకుండా, నిత్యం వార్తల్లో వుండేందుకు సంచలన, వివాదాస్పద కామెంట్స్‌కు ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయానికి …తనకు రాజకీయంగా అంత సీన్ లేదని గ్రహించారు. పాలేరులో పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన షర్మిల …చేతులెత్తేశారు. కర్నాటక కాంగ్రెస్ నాయకుల ద్వారా ఆ పార్టీ గూటికి చేరారు.
ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని స్వీకరించారు. ఆ క్షణం నుంచి తన అన్న వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. జగన్ రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. వారి ఎజెండా మేరకు రాజకీయ నడక సాగిస్తున్నారనే అభిప్రాయాన్ని జనంలో కలిగించారు. దీంతో ఆమెపై ప్రజల్లో అసహనం, ఆగ్రహం. ఈ నేపథ్యంలో కడప లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది.
అసలే వైఎస్సార్ ప్రత్యర్థులతో చేతులు కలిపి, తామెంతో అభిమానించే కుటుంబానికి నష్టం కలిగించేలా రోజుకో రాజకీయ నాటకం ఆడుతున్న షర్మిలకు గుణపాఠం చెప్పేందుకు కడప ప్రజానీకం సిద్ధంగా వుంది. వైఎస్సార్ బిడ్డగా ఇంత కాలం ఆమెను కడప ప్రజలు అభిమానించారు. ఆ ప్రేమాభిమానాలను ఆమె నిలుపుకోలేకపోయారు. ఇప్పుడామెను బ్రదర్ అనిల్ భార్యగా తప్ప, తమ ప్రియతమ నేత వైఎస్సార్ కుమార్తెగా అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు. కడప ప్రజానీకంతో ఆమెకు ఎలాంటి అనుబంధం లేదు.
వైఎస్సార్ కుమార్తెగా, జగన్ చెల్లిగా మాత్రమే ఆమెకు గుర్తింపు, గౌరవం. ఈ వాస్తవాన్ని షర్మిల విస్మరించి, తనంటే ఎక్కువ ఊహించుకుని పెద్దపెద్ద డైలాగ్‌లు చెబుతున్నారామె. జగన్ ఓటమి కాంక్షిస్తూ, ఆయన ప్రత్యర్థుల ప్రయోజనాల కోసం పరితపించే షర్మిలకు రాజకీయంగా వాతలు పెట్టేందుకు జనం కర్రు కాల్చి రెడీగా పెట్టుకున్నారు. కడప నుంచి ఆమె పోటీ చేయడం, ఎన్నికలు జరగడమే తరువాయి. షర్మిల అతికి గుణపాఠం చెప్పేందుకు కడప సిద్ధంగా వుంది.