చంద్రబాబుకు ప్రధాన శత్రువు, ప్రత్యర్థి భయమే. దాంతోనే పతనాన్ని తనకు తానే కోరి తెచ్చుకుంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాతైనా ధైర్యంగా ఉన్నారా? అంటే…అదీ లేదు. బీజేపీతో అంటకాగడం వల్ల రాజకీయంగా జరగబోయే నష్టం ఏంటో ఆయనకు బాగా తెలుసు. రాజకీయంగా నష్టపోతామనే ఆలోచన ఆయన్ను భయపెడుతోంది. బీజేపీ విషయంలో ముందు నుయ్యి … వెనుక గొయ్యి అనే సామెత చందంగా తయారైంది.
ఇప్పుడాయన భయమంతా బీజేపీతో పొత్తు వల్ల చేజేతులా అధికారాన్ని జగన్‌కు అప్పగిస్తామేమో అని. బీజేపీతో పొత్తు వల్ల రాజకీయంగా నష్టపోతామని చంద్రబాబుకు జోరీగల్లా చెప్పే వాళ్లు ఎక్కువయ్యారు. అసలే భయస్తుడు, ఆపై నెగెటివ్ అంశాలు చెప్పేవాళ్లు ఎక్కువయ్యారు. దీంతో చంద్రబాబు మనసు ప్రశాంతంగా లేదు.
తన నివాసంలో ముస్లిం సంఘాలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. బాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా డిక్లరేషన్ ప్రకటన చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో బీజేపీతో కలిశామని, ముస్లింలు దూరదృష్టితో ఆలోచించి, అండగా నిలవాలని వేడుకున్నారు. గతంలో మతపరమైన అంశాల్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదని, ఇప్పుడూ ఎలాంటి రాజీ వుండబోదని ఆయన అన్నారు.
తన రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలు తమ ఉనికికే ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటారని బాబు ఎలా అనుకుంటున్నారో అనే ప్రశ్న ఉత్పన్నమైంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క మైనార్టీకి కూడా కేబినెట్లో బాబు చోటు ఇవ్వలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఫరూక్‌కు అవకాశం ఇచ్చి, ముస్లింలకు ఏదో చేస్తున్నట్టు బిల్డప్.
ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే తమ నాలుగు శాతం రిజర్వేషన్ పోతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. అలాగే సీఏఏ అమలు చేసి, తమను ఇక్కడ ఉండకుండా చేస్తారనే భయం ముస్లింలను వెంటాడుతోంది. ముస్లింలలో భయం పోవాలంటే బీజేపీకి టీడీపీ దూరం వుండడం ఒక్కటే మార్గం. అలాగే గతంలో మోదీతో విభేదించే సందర్భంలో ముస్లింలకు పొంచి వున్న ప్రమాదం గురించి ఇదే చంద్రబాబు చేసిన హెచ్చరికలు ఇంకా వారికి గుర్తున్నాయి.
ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం ఎన్ని చెప్పినా నమ్మేదెవరు? తనకు నచ్చనప్పుడు దూషించడం, అవసరమైనప్పుడు నెత్తికెత్తుకోవడం. ఊసరవెల్లిలా చంద్రబాబు మారుతూ వుండొచ్చు… కానీ ముస్లింలు బీజేపీ, అలాగే ఆ పార్టీకి అంటకాగే పార్టీ విషయంలో అభిప్రాయాన్ని మార్చుకోమంటే ఎలా? అభిప్రాయాలు మారవని తెలుసుకాబట్టే చంద్రబాబు భయపడుతున్నారు.