ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది ఎమ్మెల్యే సీట్లు ఉంటే వైసీపీకి టీడీపీకి సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ మరోసారి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు సరైన ప్రత్యర్ధిని టీడీపీ చూపించలేకపోతోంది.
శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు గెలుపు దారిని టీడీపీలో అసమ్మతి నేతలు చూపిస్తున్నారు. అక్కడ రెండు వర్గాలుగా టీడీపీ విడిపోవడమే ఇబ్బందిగా మారింది. పలాసాలో మంత్రి సీదరి అప్పలరాజుకు రెండవసారి గెలుపు తప్పదని అంటున్నారు.
టీడీపీ నుంచి గౌతు శిరీష గట్టి పోటీ ఇచ్చినా మొగ్గు మాత్రం వైసీపీకే ఉంది. ఇచ్చాపురంలో ఈసారి వైసీపీ జెండా ఎగరేయాలని కసితో కార్యకర్తలు పనిచేస్తున్నారు. బెందాళం అశోక్ రెండుసార్లు గెలిచినా ఏమీ చేయలేదన్న అసంతృప్తి ఉంది. పాతపట్నంలో వైసీపీ బలంగా ఉంది. అభ్యర్ధిని సరైన వారిని పెట్టాల్సి ఉంది అని అంటున్నారు.
అదే సమయంలో టెక్కలి, ఆముదాలవలస, రాజాంలలో టీడీపీ బలంగా కనిపిస్తోంది. పాలకొండ, ఎచ్చెర్లలో గట్టి పోటీ ఉంది. ఈ రాజకీయ పరిణామాలు చూస్తే కనుక వైసీపీ టీడీపీల మధ్య భీకర పోరు జిల్లాలో సాగే సూచనలు కనిపిస్తున్నాయి.