గత ఎన్నికలలో జగన్ ప్రభంజనం వీచినా విశాఖ నగర పరిథిలోని నాలుగు అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఓటమి పాలు అయింది. అయితే ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో విశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరచింది. విశాఖను రాజధానిగా చేస్తామని ప్రతిపాదించింది. అదే సమయంలో జరిగిన విశాఖ నగర కార్పోరేషన్ ఎన్నికలలో మేయర్ పదవిని వైసీపీ సొంతం చేసుకుంది.
ఇపుడు సార్వత్రిక ఎన్నికలలో విశాఖ నగర పరిథిలో తన బలాన్ని పెంచుకోవాలని వైసీపీ చూస్తోంది. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుకు చెక్ పెట్టాలని అదే సామాజికవర్గానికి చెందిన అంగబలం అర్ధ బలం సమృద్ధిగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను తెచ్చి ఎమ్మెల్యే అభ్యర్ధిని చేశారు. దీంతో ఇక్కడ పోటాపోటీగా పరిస్థితి మారింది. ఎవరు గెలిచినా స్వల్ప తేడాతోనే అని అంటున్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కెకె రాజుకు విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి టిక్కెట్ ఇచ్చినా ఈసారి వైసీపీదే ఈ సీటు అని చెబుతున్నారు. విశాఖ పశ్చిమలో కాపులు టీడీపీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని టాక్. దాంతో పాటు టీడీపీలో టిక్కెట్ దక్కక బయటకు వచ్చిన పాశర్ల ప్రసాద్ పోటీ చేస్తే మాత్రం టీడీపీకి దెబ్బ అంటున్నారు.
విశాఖ దక్షిణంలో గెలిచిన వాసుపల్లి గణేష్కుమార్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ జనసేనల నుంచి ఆయన మీద పోటీకి అభ్యర్ధి ఎవరైనా మరోసారి వాసుపల్లికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే విశాఖ సిటీలో నాలుగింట రెండు అయినా ఈసారి వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు.