తెలంగాణలో సొంత పార్టీని స్థాపించి, సుమారు రెండేళ్లకు పైగా అనేక వ్యయప్రయాసలకోర్చి పార్టీని నిర్వహించి, దాదాపు రాష్ట్రమంతా సుదీర్ఘ పాదయాత్రను నిర్వహించి చేసిన కష్టాన్నంతా కూడా ఆమె కాంగ్రెసు పార్టీ విజయం కోసం త్యాగం చేశారు. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. ఆ త్యాగం ద్వారా ఆమె ఏం ఆశించారు? అలాగే, పూర్తిగా శవాసనం వేసిఉన్న ఏపీ కాంగ్రెసు పార్టీని పునరుజ్జీవింపజేసి మళ్లీ లేపి నిలబెట్టడానికి పీసీసీ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు.
అందుకు ఏం ఆశించారు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న దాన్ని బట్టి.. తెలంగాణలో చేసిన పనికే ఆమె కాంగ్రెస్ ద్వారా రాజ్యసభ ఎంపీ పదవిని ఆశించారని తెలుస్తోంది. అయితే అదనంగా ఏపీ కాంగ్రెస్ భారాన్ని ఆమె నెత్తిన పెట్టారు. అప్పటినుంచి ఆమె ఏదో తన పాట్లు తాను పడుతూ.. ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో ఒక్కశాతం ఓటు బ్యాంకు పెంచినా సరే.. చాలునని, తనకు ఆఫర్ చేసిన రాజ్యసభ పదవి తనకు దక్కుతుందని ఆశపడుతూన్నారు.
అయితే ఇప్పుడు మేడం సోనియా ట్విస్టు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. కడప ఎంపీ స్థానం నుంచి స్వయంగా షర్మిలను పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇదే జరిగితే.. షర్మిల కలలకు మేడం సోనియా గండికొట్టినట్టే అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారరు.
ఎందుకంటే- షర్మిల ఇదివరకటి ఆలోచన వేరు. వివేకా హత్య నుంచి గరిష్టంగా పొలిటికల్ మైలేజీ పిండుకోవడానికి ఆయన కూతురు సునీతను గానీ, భార్య సౌభాగ్యమ్మను గానీ కడపలో పోటీచేయించాలని షర్మిల భావించారు. అలాగే షర్మిల పులివెందులనుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఉన్నదని పుకార్లు వినిపించాయి. అయితే షర్మిల మాత్రం-తాను ఎమ్మెల్యేగా కూడా పోటీచేయకుండా. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని అనుకున్నారు. దానివల్ల పార్టీకోసం తాను కష్టపడినట్టుగా గుర్తింపు వస్తుందని, రాజ్యసభ సీటుకు మార్గం సుగమం అవుతుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు పార్టీ ఆలోచన మారుతోంది. షర్మిల పులివెందులలో పోటీచేసినా గెలిచేది లేదు. రాష్ట్రమంతా తిరిగి ప్రచారంచేసినా పార్టీకి కాసిని సీట్లు దక్కుతాయనే గ్యారంటీ లేదు. ఈ ఓవరాక్షన్ అంతా కట్టిపెట్టి, షర్మిలను కడపలో ఎంపీగా, అవినాష్ రెడ్డిమీద పోటీచేయిస్తే.. కనీసం ఆ ఒక్కసీటు అయినా తమ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఆశపడుతోంది.
కేంద్రంలో మోడీ హవాకు గండికొట్టి.. విపక్ష ప్రభుత్వం ఏర్పడాలంటే.. ప్రతి ఒక్క సీటు కూడా ఎంతో ముఖ్యం అని భావిస్తోంది. ఆ క్రమంలో.. షర్మిలను ప్రచార అవసరాలకు వాడడం కంటె.. కడప ఎంపీ సీటులో వాడితే.. గెలిచే అవకాశం ఉందని.. కేంద్రంలో పార్టీకి కలిసివస్తుందని అనుకుంటున్నారు. మరి మేడం- అధిష్ఠానం ఆడుతున్న ఈ చదరంగంలో పావుగా.. షర్మిల పరిస్థితి ఏమవుతుందో వేచిచూడాలి.