అమెజాన్ హడావుడి ఎందుకు? ఏమిటి?

ఓటిటి మార్కెట్ డౌన్ అయింది. సినిమాల నిర్మాణం కిందా మీదా అవుతోంది అని సర్వత్రా వార్తలు వ్యాపించిన నేపథ్యంలో అమెజాన్ సంస్థ ముంబాయి లో ఓ భారీ హడావుడి తలపెట్టింది. ఈ నెల 19న…

ఓటిటి మార్కెట్ డౌన్ అయింది. సినిమాల నిర్మాణం కిందా మీదా అవుతోంది అని సర్వత్రా వార్తలు వ్యాపించిన నేపథ్యంలో అమెజాన్ సంస్థ ముంబాయి లో ఓ భారీ హడావుడి తలపెట్టింది. ఈ నెల 19న ముంబాయిలో అన్ని భాషల సినిమా సెలబ్రిటీలను ఆహ్వనిస్తోంది. ఓ క్యు అండ్ ఏ సెషన్ నిర్వహించబోతోంది. అదే రోజు రాత్రి భారీ పార్టీని హోస్ట్ చేయబోతోంది. మన టాలీవుడ్ నుంచి చాలా మంది నిర్మాతలు, దర్శకులు, కొంత మంది హీరోలు, మీడియా పర్సన్ లు ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారు.

ఫండ్స్ లేవని, లేదా సినిమాలు కొనడం తగ్గించారని వార్తలు వ్యాపించిన నేపథ్యంలో, చాలా సినిమాల డిజిటల్ అమ్మకాలు ఆగిన తరుణంలో అమెజాన్ ఈ హడావుడి చేయడానికి కారణం ఏమిటి అన్నది జవాబు తెలియాల్సిన ప్రశ్న. బహుశా ఈ ప్రశ్నకు రేపు ఈవెంట్ లో సమాధానం లభించవచ్చు. జియో సంస్థ భారీగా రంగంలోకి దిగుతూ వుండడం, నెట్ ఫ్లిక్స్ కూడా గట్టి సవాలు విసురుతూ వుండడం, కొత్త ఫైనాన్సియల్ ఇయర్ స్టార్ట్ కావడం వంటి కారణాలతో తన క్లయింట్స్ ను పెంచుకోవడం, తనతో బలంగా వుంచుకోవడం వంటి పనుల కోసం అమెజాన్ ఈ మీట్ ను నిర్వహిస్తూ వుండి వుండొచ్చు.

అమెజాన్ వైపు నుంచి ఈ మీట్ నిర్వహణకు కారణాలు ఏమైనా, తెలుగు నిర్మాతల వైపు నుంచి ఇలాంటి మీట్ అవసరమే. నిర్మాతలకు ఓటిటి కొనుగోళ్ల మీద చాలా సందేహాలు వున్నాయి. వాటన్నింటికి అక్కడ నుంచి సమాధానాలు రాబట్టుకోవచ్చు. అదే విధంగా అమెజాన్ బడ్జెట్ వైనాలు, వాటి రిలీజ్ సంగతులు, వాటికి అనుగుణంగా సినిమాలు ప్లాన్ చేసుకోవడం లాంటి మెళకువలు తెలుసుకోవచ్చు.

కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న సంగతులు వేరుగా వున్నాయి. ఇప్పటికీ అమెజాన్ ఏమంత భయంకరంగా బడ్జెట్ పెట్టుకుని కూర్చోలేదని, క్రీమీ లేయర్ ను మాత్రమే తీసుకుంటాం అంటే పని జరగదు కనుక, టోటల్ గా అందరితో టచ్ లో వుంటూ తనకు కావాల్సిన కంటెంట్ ను మాత్రం తీసుకునే ప్లాన్ లో వుందని, ఆ టచ్ లో వుండడం కోసమే ఈ మీట్ అని ఇండస్ట్రీ జనాల విశ్లేషణ.