ముందే ఊహించినట్లు తెలంగాణ గవర్నర్ తమిళి సై తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. గతంలోనే తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పినట్లే గవర్నర్ పదవికి రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్దమవుతున్నారు. 2019లో తెలంగాణ గవర్నర్ పదవి చేపట్టగా.. గత ఏడాది నుండి పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ తన రెండు పదవులకు రాజీనామా చేసి ఆ పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి రామనాథపురం నియోజవర్గం నుండి బరిలోకి దిగి ఓడిపోయారు. అలాగే 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుండి బీజేపీ తరుఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి 2019లో గవర్నర్ పదవిని కట్టబెట్టింది.
తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితులతో.. చెన్నై సెంట్రల్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తమిళ సై పోటీకి బీజేపీ అధినాయకత్వం అమోదం తెలపడంతోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పలుమాల్లు విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని వెనక్కి తిప్పి పంపడం, పెండింగ్లో ఉంచడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఆ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.