చిలకలూరిపేట ప్రజాగళం సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమిపై ధ్వజమెత్తారు.
మోదీ సభలో మైకులు పని చేయలేదన్నారు. పరిస్థితులు, దేవుడు, ప్రకృతి , దేవుడు కూటమి పక్షాన లేరని అన్నారు. ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని మార్గాని భరత్ ఆరోపించారు. ప్రజాగళం సభలో ప్రత్యేక హోదా గురించి మోదీని ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు.
గతంలో మోదీని చంద్రబాబునాయుడు అనరాని మాటలు అన్నారని మార్గాని భరత్ గుర్తు చేశారు. ప్రధాని మోదీకి చంద్రబాబు , పవన్‌కల్యాన్ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఏం సహాయం చేసిందని ఎన్డీఏలో చేరారని చంద్రబాబును భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు జీవితంలో విలువలు, విశ్వసనీయత అనేవి లేవని దెప్పి పొడిచారు.
రాష్ట్రం గురించి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆలోచించే నాయకులు కాదన్నారు. మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని భరత్ దెప్పి పొడిచారు. విభజన హామీలు ఇంత వరకూ అమలుకు నోచుకోలేదని ఆయన విమర్శించారు.