చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి. మోదీ ప్రసంగంపై ఇటు ప్రధాన మీడియా, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకూ ప్రధాని మోదీ ఎందుకు వచ్చారు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించడమే ప్రధాని మోదీ రహస్య ఎజెండా అని టీడీపీ, జనసేన శ్రేణులు అంటున్నాయి.
మరోసారి వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమనే అభిప్రాయం బలపడుతోంది. ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు ఏమన్నారంటే…”చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అనలేదు? ఎన్డీఏ ప్రభుత్వం రావడం వేర్వు, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటీ కాదు. తెలుగుదేశం దృష్టిలో అవి రెండు ఒకటే. కానీ బీజేపీ దృష్టిలో మాత్రం కాదు. చంద్రబాబునాయుడిని ఎండార్స్ చేయడానికి మోదీ ఇష్టపడలేదు. బీజేపీ తన అవసరాలు, ప్రయోజనాల కోసం.. అవసరమైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి ఈ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు క్రమంలో జగన్‌తో బీజేపీ వైరాన్ని కోరుకోవడం లేదు” అని స్పష్టం చేశారు.
సీఎం జగన్‌పై కనీసం ఒక్కటంటే ఒక్క ఘాటైన విమర్శ కూడా చేయకపోవడంతో, కేంద్ర ప్రభుత్వ ప్రేమంతా ఏపీ సీఎంపైనే అని టీడీపీ, జనసేన శ్రేణులు ఆగ్రహంతో అంటున్నాయి. పొత్తు మాత్రం తమతో, ప్రేమ మాత్రం జగన్‌పైనా? అని నిలదీస్తున్న పరిస్థితి. ఇలాగైతే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం ప్రయోజనం అని వారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల రాజకీయంగా టీడీపీ, జనసేన తీవ్రంగా నష్టపోతాయని, ఏ ప్రయోజనాల కోసం భారీ మూల్యం చెల్లించుకోడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారో అర్థం కావడం లేదనే ప్రశ్న టీడీపీ, జనసేన శ్రేణుల నుంచి ఎదురవుతోంది.
గతంలో తనను, బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్టు తిట్టడాన్ని ప్రధాని మోదీ ఇప్పటికీ మరిచిపోలేదు అనేందుకు తాజా ప్రసంగమే నిదర్శనమని అంటున్నారు. బాబు కాళ్లావేళ్లా పడడంతో పొత్తు పెట్టుకున్నారే తప్ప, ఆయనపై అభిమానంతో కాదనే నిజం బయట పడిందనేది అందరి అభిప్రాయం. జగన్‌ను సీఎంగా చూడడానికే మోదీ ఇష్టపడుతున్నారని , ఆయన ప్రసంగం స్పష్టమైన సంకేతం ఇచ్చిందని సర్వత్రా అనుకుంటున్న మాట.