రెండు నెలలు గట్టిగా జనంలో తిరిగితే ఐదేళ్లు జనాన్ని మన చుట్టూ తిప్పుకోవచ్చు. దీన్నే ప్రజాస్వామ్యం అంటారు. కాకపోతే ఏసీలకు అలవాటు పడిన ప్రాణాలు ఎర్రటి ఎండలో తిరగాలి. అభ్యర్థిగా వుండడంలోని కష్టాలన్నీ కళ్ల ముందుకి వస్తాయి. జనం కూడా సినిమా చూపిస్తారు. ఓటు వేయడానికి డబ్బులు ఎలాగూ తీసుకుంటారు. అదనంగా అనేక కోరికలు కోరతారు. తీర్చకపోతే అలుగుతారు. ఒక వూళ్లో గుడి కట్టించమంటారు. ఇంకో వూళ్లో క్రికెట్ గ్రౌండ్ రెడీ చేయమంటారు. రోడ్లు రిపేర్ చేయమని ఎవరూ అడగరు. ఎందుకంటే అలవాటు పడిపోయారు.
నాయకులు తెల్లారిలేస్తే నాలుగైదు వాహనాల్లో జనంతో ప్రచారం బయల్దేరుతారు. భోజనాలు, మందు ఎలాగూ వుంటాయి. వెళ్లిన వూళ్లో పెళ్లి వుంటే ఆశీర్వాదంతో పాటు చదివింపులు. చావుంటే నాలుగు కన్నీటి బొట్లు, దహనానికి డబ్బు.
పగలు ప్రచారం తర్వాత రాత్రిపూట తగాదాల పరిష్కారం, మధ్యస్తాలు. అవతల వైపు జారిపోకుండా చిన్న నాయకులకు వల. వాళ్లు నోటికి వచ్చినంత అడుగుతారు. ఒక రేటు కుదుర్చుకోవాలి. అవతలి వైపు నుంచి సందేశాలు వస్తుంటాయి. జాగ్రత్తగా గమనించుకుంటే దూకడానికి రెడీ అని, దూకేలా చూసుకోవాలి. అభ్యర్థి కాకుండా, భార్యాపిల్లలు, బంధుమిత్రులు, రకరకాల బృందాలుగా ప్రచారానికి వెళ్లి వస్తుంటారు. వీళ్లు కాకుండా రోజువారీ కూలీలతో ప్రచారం చేసేయొచ్చు. ప్రింట్, చానల్, యూట్యూబ్ చానల్ పేరుతో నియోజకవర్గానికి ఎన్నో వందల మంది విలేకరులు , యాజమాన్యానికి యాడ్స్, పెయిడ్ న్యూస్, విలేకర్లకి వ్యక్తిగత కానుకలు. రోజూ ఒక ఏనుగుని మేపినట్టే.
నియోజక వర్గంలో పెద్ద నాయకుడు సభ పెడితే సక్సెస్ చేయాలి. వేలాది మంది జనాన్ని తోలాలి. విందు, మందు, డబ్బు పంచాలి. తెలంగాణాలో సమస్య లేదు. మందు మస్త్. ఆంధ్రాలో మంచి మందు దొరకదు. దొరికినా కొనాలంటే వాచిపోతుంది.
ఎండల్లో వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి. తగిలితే పోయినా పోతాం. వెళ్లిన చోట జనాలు ఏదో ఒక మర్యాద చేస్తారు. టీ ఘోరంగా వున్నా తాగి చిరునవ్వు నవ్వాలి. సుగర్ ఉన్నా జ్యూస్ తాగాలి. ఇవి కాకుండా కుండలు కాల్చి, బజ్జీలు వేసి, ఇస్త్రీ చేసి, బట్టలు ఉతికి ఫొటోలకు ఫోజులివ్వాలి. ఇన్ని చేసిన తర్వాత కూడా ఓటరు కరుణించడు. డబ్బులివ్వాలి. జాగ్రత్తగా వుండకపోతే పోలీసులు సీజ్ చేస్తారు.
ఎవడో ఒకన్ని నమ్మాలి. నమ్మిన వాడు ఎంతోకొంత తింటాడు. చచ్చి సున్నమై పోలింగ్‌కి వెళ్లాలి. కౌంటింగ్ వరకూ నరాలు తెగేలా ఎదురు చూడాలి. ఎన్నికల్లో ఇన్ని కష్టాలు, పంచుడు వుంటే గెలిచాక తినకుండా వుండడం ఎట్లా! తినకపోతే గెలవడమెందుకు? నువ్వు గులకరాయి తిను, నేను కొండను తింటా. ఇదే కదా ప్రజాస్వామ్యం.