Advertisement

Advertisement


Home > Politics - Opinion

పంజ‌రాల్ని ప్రేమించే చిలుకలు

పంజ‌రాల్ని ప్రేమించే చిలుకలు

గావు కేక‌లు పెట్టే కాకిని ఎవ‌రూ పట్టించుకోరు. ముద్దుగా మాట్లాడే రామ‌చిలుక‌ని పంజ‌రంలో పెడ‌తారు. నువ్వు క‌ళాకారుడివైతే పంజరమే నీ కోసం సిద్ధంగా వుంటుంది. లేదా నువ్వే డ‌బ్బుల కోసం పంజ‌రంలో చిక్కుకుని , కాయిన్ సౌండ్‌కి అనుగుణంగా నీ పాట‌ని ట్యూన్ చేసుకుంటావు.

కోకిల‌ని అంద‌రూ ప్రేమిస్తారు. పాడిన త‌ర్వాత పైస‌లు అడిగితే బిచ్చ‌గ‌త్తెగా చీద‌రించుకుంటారు. గొంతుని పొగిడిన వాళ్లే, న‌ల్ల‌టి రూపాన్ని విమ‌ర్శిస్తారు. ఇంద్ర‌జాలం ఎక్క‌డో జ‌ర‌గ‌దు. నీ క‌ళ్ల ముందే జ‌రుగుతూ వుంటుంది. నిన్ను మాయ చేయ‌డానికి ఇంకెవ‌రో... ఎవ‌రినో మాయ చేయ‌డానికి నువ్వు.

తాబేళ్లు అధికారంలోకి వొస్తే నిదాన‌మే ప్ర‌ధానం అని జాతీయ నినాదాన్ని త‌యారు చేస్తాయి. డిప్ప వుంటేనే ప‌ద‌వులు. కుందేళ్ల కాళ్లు విర‌గ్గొట్టి వేగం అనే ప‌దాన్నే డిక్ష‌న‌రీల్లో లేకుండా చేస్తాయి. అధికారంలో వుంటే మైక్ అన‌వ‌స‌రం. గుండు సూదితో శ‌బ్దం చేసినా, భ‌జ‌న పాట మొద‌ల‌వుతుంది.

క‌ళ‌ల‌న్నీ భ‌జ‌న పాట‌ల రూపాంత‌రాలే. చిడ‌త‌లుంటే నీ చేతిలో క‌లం అక్క‌ర‌లేదు. రాయ‌కపోయినా గొప్ప రాత‌గాడే, అక్ష‌రాల‌తో సాలెగూడులు అల్లు. పురుగులు అవే వ‌స్తాయి. జీర్ణ‌మ‌వుతున్న‌పుడు కూడా ర‌క్ష‌కుడే భ‌క్ష‌కుడ‌ని గ్ర‌హించ‌లేవు.

చేప‌ల విషాదం ఏమంటే, అవి త‌మ క‌న్నీళ్ల‌ని గుర్తించ‌లేవు. క‌న్నీళ్లు తాగుతూ జీవిస్తూ వుంటాయి. గాలానికి వున్న కాసింత తిండి, త‌మ ఆఖ‌రి భోజ‌న‌మ‌ని గ్ర‌హించ‌లేవు. వ‌ల‌లో దూకుతున్న‌ప్పుడు అది మ‌రో ప్ర‌పంచ‌మ‌ని అనుకుంటాయి.

రుద్రాక్ష‌ల‌కి ఎందుకంత డిమాండ్ అంటే, న‌క్క‌లే కొనుగోలుదారులే కాబ‌ట్టి. జీవ‌న‌త‌త్వాన్ని బోధించేవాడే నిన్ను వండ‌డానికి పాత్ర‌ని సిద్ధం చేస్తాడు. నీళ్లు వేడెక్కే వ‌ర‌కూ ఉప‌న్యాసం ఇస్తాడు. పోయే వాడికి మంచి మాట‌లు చెప్ప‌డం వేదాంత సారం.

చ‌దువుల మ‌ర్మమెల్ల చ‌దివితి తండ్రి అని ప్ర‌హ్లాదుడు అన్న‌పుడు త‌న కోసం స్తంభంలో న‌ర‌సింహుడు వున్నాడ‌ని హిర‌ణ్య‌క‌శ్య‌పుడికి తెలియ‌దు. వ‌రం ఇచ్చిన వాడే సంహ‌రించ‌డానికి అవ‌తారం ఎత్తుతాడు.

నాట‌కం జ‌రుగుతూ వుంది. పాత్ర‌దారులు పాత్ర‌ల్ని మ‌ర్చిపోయారు. హీరో ఎవ‌రో, విల‌న్ ఎవ‌రో తెలియ‌దు. అయినా జ‌నం చ‌ప్ప‌ట్లు కొడుతూనే వున్నారు. క‌థ అక్క‌ర‌లేదు, క్యారెక్ట‌ర్ అవ‌స‌రం లేదు. రంజింప‌చేస్తే చాలు.

విదూష‌కుడు వ‌చ్చి, మీరు చూడాల‌నుకున్న‌ది, చూస్తున్న‌ది ఒక‌టి కాదు అని చెబితే వాడిని చావ‌గొట్టారు. నామ‌వాచ‌కాల‌తో ప‌నిలేదు. ఎవ‌డైనా ఒకటే. నీతి పుస్త‌కాల్లోంచి తాచు పాములు బ‌య‌టికొస్తున్న కాలం.

ముగిసిన త‌ర్వాత అర్థ‌మైంది. నాట‌కం జ‌రిగింది వేదిక‌పైన కాద‌ని, ప్రేక్ష‌కులే నాట‌కం ఆడితే , న‌టులు ఆశ్చ‌ర్య‌పోయి చూసార‌ని, నాట‌కం ఎవ‌రూ రాయ‌క్క‌ర్లేదు. ఇది వ‌ర‌కే లిఖించి వుంది.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?