Advertisement

Advertisement


Home > Politics - Andhra

రాజు గారి కోటలో గాజు గ్లాస్!

రాజు గారి కోటలో గాజు గ్లాస్!

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ రెబెల్ గా పోటీ చేస్తున్న మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దాంతో ఇపుడు టీడీపీ కూటమిలో గుబులు మొదలైంది. అసలే గీత ఫైర్ బ్రాండ్. ఆమెకు సరైన గుర్తు వచ్చిపడింది.

ఆమె 2014 నుంచి 2019 దాకా టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలోనే రాజుల కోటకు దూరంగా ఉంటూ తన సొంత అస్థిత్వాన్ని చాటుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు 2019లో టికెట్ టీడీపీ తరఫున దక్కలేదు. 2024లో కూడా అదె విధంగా హ్యాండ్ ఇచ్చేసరికి ఆమెకు మండుకొచ్చింది.

ఎందుకొచ్చిన సైకిల్ పార్టీ అని పక్కన పెట్టి మరీ రెబెల్ గా రంగంలోకి దూకారు. ఆమెకు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు. ఆమె తూప్రు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. విజయనగరం అసెంబ్లీ సీటు పరిధిలో ఆ సామాజిక వర్గం వారు డెబ్బై నుంచి ఎనభై వేల మంది దాకా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరిది ముప్పయి శాతం పైగా అన్న మాట.

వారికి దశాబ్దాలుగా ఎమ్మెల్యే కావాలన్న కోరిక. ఓట్లు మావి సీట్లు మీకా అన్నది వారి నినాదం. దశాబ్దాలు కాచుకున్న మీదట 2014లో గీత ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ అణగదొక్కే చర్యలు మొదలెట్టారు. ఇపుడు ఆమె రెబెల్ గా పోటీ చేయడం వెనక ఆ సామాజిక వర్గం ఒత్తిడి కూడా పెద్ద ఎత్తున ఉంది.

ఒకసారి ఎమ్మెల్యే చేశారు. సమర్ధురాలు అయిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇపుడు గీత పోటీకి దిగడం, అందరికీ పరిచయం ఉన్న గుర్తు కూడా దక్కడంతో మీసాల గీత ఎవరి రాజకీయ రాతను తల్లకిందులు చేస్తారో అన్న టెన్షన్ మొదలైంది. ఆమె పోటీ వల్ల టీడీపీ కూటమికి భారీ దెబ్బ అని అంటున్నారు.

తన వారసురాలుగా కుమార్తె అదితి గజపతిరాజుని పోటీలో పెట్టిన పెద్దాయన అశోక్ కి ఈసారి అయినా కూతురు రూపంలో విజయం దక్కుతుందా లేదా ఓట్ల చీలిక టీడీపీ కొంప ముంచుతుందా అన్నది అతి పెద్ద టెన్షన్ గా వుంది అంటున్నారు.

విజయనగరంలో ఈసారి ఎన్నికల సమరం కడు ఆసక్తికరం అని చెప్పుకుని తీరాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?