ఆంధ్ర సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. కానీ అసలైన సమరం ఇప్పుడే మొదలైంది. చాలా చోట్ల పరస్పర దాడులు, దారుణ మారణ కాండలు. సోషల్ మీడియాలోకి వస్తున్న వీడియోలు చూస్తుంటే అసలు ఆంధ్ర ఎటు వెళ్తోంది అనే అనుమానం కలుగుతోంది.
నిజానికి ఇది కొత్త కాదు. ప్రతి ఎన్నిక తరువాత పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో గెలిచిన వారు ఓడిన వారి మీద దాడులు చేయడం, గ్రామాల్లో మారణ కాండలు జరిగాయి. అది గెలుపు లేదా ఓటమి తెలిసిన తరువాత, అధికారంలోకి వచ్చాక, ఆ అండ చూసుకుని జరిగాయి.
కానీ ఈసారి ఎన్నికల పోలింగ్ రోజునే మొదలయ్యాయి. ఎమ్మెల్యేలను తరమడం, పరుగెత్తించడం ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తొలి రోజు దాడుల్లో ప్రతిపక్షానిదే ప్లానింగ్ ఇంకా పై చేయి అయినా, కుల మీడియా మాత్రం వైకాపా ఎమ్మెల్యేల మీద ప్రజల దాడి అన్నట్లు ప్రొజెక్ట్ చేసింది. రెండో రోజు ఇరు పక్షాలు ఎవరి బలం వున్న చోట్ల వాళ్లు దాడులు మొదలుపెట్టారు. దీన్ని మొత్తం అధికార పక్షం దమనకాండ కింద జమేస్తున్నారు.
ఎన్నికలు ఆరంభమైన దగ్గర నుంచి తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే ద్వేష పూరిత ప్రచారం జరిగింది. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ను పేర్కొంటూ, వీళ్ల సంగతి చూడాలంటే తమ పార్టీ నేతలకు బాహాటంగా పోస్ట్ ల ద్వారానే చెప్పడం ఆరంభమైంది.
ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితులు దారుణంగా వుండేలా కనిపిస్తున్నాయి. వైకాపా అధికారం చేపడితే తెలుగుదేశం జనాల దుంప తెంచుతుంది. కూటమి అధికారంలోకి వస్తే వైకాపా జనాల మీద గత అయిదేళ్లుగా పెంచుకున్న కసిని తీర్చుకునే పని మొదలుపెడుతుంది. మొత్తానికి ఇప్పుడు ఆంధ్ర అంటే కక్ష పూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.