అధికారంపై వైసీపీ ధీమా

అధికారంపై వైసీపీ చాలా ధీమాగా వుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, వృద్ధులు ఎక్కువ సంఖ్య‌లో ఓటింగ్‌లో పాల్గొన‌డం అధికార పార్టీకి ధైర్యాన్ని ఇచ్చింది. వైఎస్ జ‌గ‌న్ పాల‌న ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విధంగా సాగింది.…

అధికారంపై వైసీపీ చాలా ధీమాగా వుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, వృద్ధులు ఎక్కువ సంఖ్య‌లో ఓటింగ్‌లో పాల్గొన‌డం అధికార పార్టీకి ధైర్యాన్ని ఇచ్చింది. వైఎస్ జ‌గ‌న్ పాల‌న ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విధంగా సాగింది. జ‌గ‌న్ ప్ర‌తి సంద‌ర్భంలోనూ నా అక్క‌చెల్లెళ్లు అంటూ మాట్లాడుతుంటారు. అమ్మ ఒడి, ఆస‌రా తదిత‌ర ప‌థ‌కాల ల‌బ్ధిని నేరుగా మ‌హిళ‌ల ఖాతాల‌కే జ‌మ చేశారు.

అలాగే మ‌హిళ‌ల పేరుతో ఇంటి ప‌ట్టాలు ఇచ్చారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి డ్వాక్రా రుణాల‌ను ర‌ద్దు చేశారు. గ‌తంలో చంద్ర‌బాబు పాల‌నంతా మోస‌పూరిత‌మే అని మ‌హిళ‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. డ్వాక్రా రుణాల‌ను ర‌ద్దు చేస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు… ఐదేళ్ల పాల‌న‌లో ఆ ఊసే ఎత్త‌లేదు. ఎన్నిక‌ల ముందు ప‌సుపు- కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ ప‌ది వేల సొమ్ముతో 2019లో మ‌రోసారి మ‌హిళ‌ల ఓట్లు దండుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, వారంతా గుణ‌పాఠం చెప్పారు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌హిళ‌ల‌కు కోపం ఉండ‌డానికి అవ‌కాశ‌మే లేదు. మ‌హిళ‌ల శ్రేయ‌స్సే త‌ప్ప‌, వారికి న‌ష్టం తెచ్చే ఒక్క ప‌నీ జ‌గ‌న్ చేయ‌లేద‌నే అభిప్రాయం వుంది. ఇదే ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌లిసొచ్చే అంశంగా చెబుతున్నారు. సామాజిక పింఛ‌న్‌దారుల విష‌యంలోనూ వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించింది. 

చంద్ర‌బాబు, జ‌గ‌న్ పాల‌న‌కు స్ఫ‌ష్ట‌మైన తేడాను గుర్తించింది మొద‌ట సామాజిక పింఛ‌న్‌దారులే. బాబు పాల‌న‌లో పంచాయ‌తీ కార్యాల‌యాల వ‌ద్ద‌కు రోజుల త‌ర‌బ‌డి తిరిగి, గంట‌ల‌కొద్ది వేచి వుంటే త‌ప్ప‌… వెయ్యి రూపాయ‌ల పింఛ‌న్ ద‌క్కేది కాదు. కేవ‌లం ఎన్నిక‌ల ముందు మాత్ర‌మే చంద్ర‌బాబు రూ.2 వేల‌కు పింఛ‌న్ పెంచారు. అది కూడా వైఎస్ జ‌గ‌న్ దెబ్బ‌కు భ‌య‌ప‌డి అని ప్ర‌త్యేక చెప్పాల్సిన ప‌నిలేదు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సామాజిక పింఛ‌న్‌దారుల ఇళ్ల‌కే వ‌లంటీర్లు వెళ్లి పింఛ‌న్ సొమ్ము పంపిణీ చేసేవారు. జ‌గ‌న్ చేతిలో అధికారాలు లేక‌పోతే, రెండు నెల‌లు వారంతా న‌ర‌కం చూశారు. త‌న‌ను వారంతా న‌మ్మ‌ర‌నే ఉద్దేశంతోనే రూ.4 వేలు పింఛ‌న్ ఇస్తాన‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికారు. కానీ వారి నుంచి ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌ని అంటున్నారు.

మ‌హిళ‌లు, సామాజిక పింఛ‌న్‌దారులకు తోడు ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీలు, ద‌ళితులు, రెడ్లు తమ‌కు అండ‌గా ఉన్నార‌ని వైసీపీ న‌మ్ముతోంది. అలాగే బీసీల్లో సగం మంది త‌మ వైపు ఉన్నార‌ని వైసీపీ విశ్వ‌సిస్తోంది. టీడీపీకి ఇంత కాలంగా అండ‌గా ఉన్న బీసీల్లో చీలిక తెచ్చామ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఇవ‌న్నీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు క‌లిసొచ్చాయ‌ని వైసీపీ నేత‌లు వివ‌రిస్తున్నారు. అందుకే మ‌రోసారి ఘ‌న విజ‌యం సాధిస్తామ‌ని వైసీపీ నేత‌లు ధీమాగా చెబుతున్నారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంపై గ‌తంలో కంటే రెట్టింపు విశ్వాసంతో ఉండ‌డం విశేషం, ఇక అధికారంపై ఎన్డీఏ నేత‌లు కూడా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రి లెక్క‌లు వారివి. ప్ర‌జ‌ల లెక్కేంటో ఈవీఎంల‌లో నిక్షిప్త‌మైంది.