బీజేపీ ప్రచారంలో మరో భావోద్వేగ అంశం పీఓకే

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలతోపాటు ప్రజల్లో గూడు కట్టుకున్న భావోద్వేగ అంశాలను కూడా పట్టుకుంటాయి. ఈ ఎమోషనల్ అంశాలు ప్రాంతీయ పార్టీలకు ఒకలాగా, జాతీయ పార్టీలకు మరొకలాగా ఉంటాయి. జాతీయ పార్టీలు…

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలతోపాటు ప్రజల్లో గూడు కట్టుకున్న భావోద్వేగ అంశాలను కూడా పట్టుకుంటాయి. ఈ ఎమోషనల్ అంశాలు ప్రాంతీయ పార్టీలకు ఒకలాగా, జాతీయ పార్టీలకు మరొకలాగా ఉంటాయి. జాతీయ పార్టీలు దేశానికి సంబంధించిన ఎమోషనల్ అంశాలను ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటాయి. కాషాయ పార్టీని బద్నాం చేయడానికి ప్రతిపక్షాలు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నాయి.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తుందని తీవ్రంగా ప్రచారం చేశాయి. దానికి వివరణ ఇచ్చుకోవడానికే బీజేపీ నాయకులు చాలా సమయం ఖర్చు చేయాల్సి వచ్చింది. రిజర్వేషన్లు ఎత్తేసే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు అనేది ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపించే ఎమోషనల్ అంశం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసినా దేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ ప్రచారంలో బీజీపీ నాయకులు మరో భావోద్వేగ అంశాన్ని ఎంచుకున్నారు. అదే …పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్ ). ప్రస్తుతం ఇది రగులుతున్న సమస్య. అంటే కరెంట్ అఫైర్ అన్నమాట. పీవోకే ప్రస్తుతం అట్టుడికి పోతోంది. హింసాత్మకంగా మారింది. అక్కడ భారత అనుకూల నినాదాలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ ప్రభావం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనూ విపరీతంగా పడింది.

నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ప్రజలు ఉవ్వెత్తున రోడ్ల మీదికి వచ్చి జై భారత్ నినాదాలు చేస్తున్నారు. పాక్ భద్రతా దళాలకు ఎదురు తిరుగుతున్నారు. ఆందోళనలు చల్లబరచడానికి పాక్ ప్రభుత్వం 23 బిలియన్ల సాయం (ఇండియన్ కరెన్సీలో 718 కోట్ల రూపాయలు ) ప్రకటించింది. అయినా ఆందోళనలు ఆగడంలేదు. కొన్ని చోట్ల పీవోకేను భారత్‌లో కలపాలని  కోరుతూ పోస్టర్లు వెలవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.

ముజఫరాబాద్‌, రావాలకోట్‌ ఇతర చోట్ల పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణ పడిన ఘటనలు చోటుచేసుకొన్నాయి. దడ్యాల్‌లో ఆందోళనకారులపైకి పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. పీవోకేలోని భింబేర్‌, బాగ్‌, మీర్‌పూర్‌ సహా పలు ప్రాంతాల్లో మొబైల్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను  నిలిపివేశారు. ఈ పరిస్థితిని గమనిస్తున్న బీజేపీ పీవోకేను భారత్ లో కలుపుకుంటామని ఎన్నికల ప్రచారంలో  చెబుతోంది. దీనిపై అమిత్ షా గట్టిగా మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ బాంబులు పెట్టినా భయపడమంటున్నాడు.

భారత్ , పాకిస్తాన్ మధ్య పీవోకే ఎప్పటి నుంచో రగులుతున్న సమస్యే. ‘‘అస‌లు జ‌మ్ముకశ్మీర్ అంశం భార‌త్- పాక్‌ల మ‌ధ్య వివాదమే కాదు.. వివాదం ఉన్న‌ది పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీవోకే) తోనే. పాక్ ఆధీనంలో ఉన్న క‌శ్మీర్ భాగాన్ని తిరిగి సొంతం చేసుకోవ‌డ‌మే ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం.’’ చాలాకాలంగా బీజేపీ మాతృసంస్థ‌ ఆర్ఎస్ఎస్ చెబుతోంది.  ఆ సంస్థ దీర్ఘ‌కాలిక లక్ష్యాల్లో ఇదీ ఒక‌టి. ఇప్పుడు ఆ ల‌క్ష్య‌ సాధ‌న కోసం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను మోదీ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతోందా..? బీజేపీ అగ్రనేతల ప్రచారం మాత్రం అలాగే ఉంది.

పీవోకే ప్ర‌జ‌ల‌కు పూర్తి న్యాయం జ‌ర‌గాలంటే దానిని భార‌త్ స్వాధీనం చేసుకోవ‌డ‌మే మార్గ‌మ‌ని ఆర్ఎస్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ద‌త్తాత్రేయ హోస‌బ‌లే  కొంతకాలం కిందట  జ‌మ్ముక‌శ్మీర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో వ్యాఖ్యానించారు. 1947 నుంచి క‌శ్మీర్‌  లోయ‌లో పాక్ అరాచకాలు కొనసాగుతున్నాయని, పాక్ దుర్మార్గాల వల్ల కశ్మీర్ ప్రజలు అనేక ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చిందన్నారు. త‌మ స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం పీవోకే ప్ర‌జ‌లు భార‌త్‌వైపు చూస్తున్నార‌ని ద‌త్తాత్రేయ‌
అన్నారు.

భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్  కూడా దాయాది దేశంతో మ‌ళ్లీ యుద్ధ‌మంటూ జ‌రిగితే పీవోకే ఇండియాలో అంత‌ర్భాగం కావ‌డం ఖాయ‌మ‌ని, ఎందుకంటే అది భార‌త్‌కే చెందుతుంద‌ని తేల్చి చెప్పారు. కుట్ర‌ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనే సామ‌ర్థ్యం భార‌త్‌కు ఉంద‌ని ర‌క్ష‌ణ‌మంత్రి అన్నారు. పీవోకే విష‌యంలో మోదీ ప్ర‌భుత్వం ఇక‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌బోతుంద‌న‌డానికి ఇది సంకేత‌మ‌న్న విశ్లేష‌ణలు వెలువ‌డుతున్నాయి.

వాస్త‌వానికి ద‌శాబ్దాలుగా పాక్ సైన్యం, ఐఎస్ఐల కుట్ర‌ల‌ను, శ‌త్రుదేశ‌ ప్రేరేపిత ఉగ్ర‌చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌డం పైనే భార‌త్ ప్ర‌ధానంగా దృష్టి సారిస్తూ వ‌చ్చింది. దాంతో భార‌త్ మెత‌క దేశ‌మ‌నే ముద్ర ప‌డింది. ఆర్టికల్ 370 ని ధైర్యంగా రద్దు చేసిన మోడీ ప్రభుత్వం పీవోకేను కూడా స్వాధీనం చేసుకుంటుందని కొందరు చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ ప్ర‌స్తుతం ఆర్థికంగా గ‌తంలో ఎన్న‌డూ లేనంత బ‌ల‌హీనంగా ఉంది.

చైనాతోపాటు, ఇస్లామిక్ దేశాలు చేస్తున్న‌ ఆర్థిక సాయంతో నెట్టుకొస్తోంది. ప్రభుత్వ కంపెనీలను కూడా తెగనమ్మడానికి సిద్ధమైంది. ఈ స‌మ‌యంలో భార‌త్‌తో యుద్ధానికి త‌ల‌ప‌డ‌టం ఆ దేశానికి త‌ల‌కుమించిన ప‌నే. ఈ కార‌ణంగా ఇదే పీవోకే స్వాధీనానికి స‌రైన స‌మ‌య‌మ‌ని మోదీ ప్ర‌భుత్వం భావిస్తుండ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చూడాలి.