బన్నీని దూరం పెట్టేసినట్లేనా?

మెగా ఫ్యామిలీ అంటే మూలం.. మెగాస్టార్.. నాగబాబు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ముగ్గురికీ అల్లు అర్జున్ దూరం అయిపోయినట్లు కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఇప్పుడు ఈ ముగ్గురు అల్లు అర్జున్…

మెగా ఫ్యామిలీ అంటే మూలం.. మెగాస్టార్.. నాగబాబు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ముగ్గురికీ అల్లు అర్జున్ దూరం అయిపోయినట్లు కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఇప్పుడు ఈ ముగ్గురు అల్లు అర్జున్ మీద చాలా గుర్రుగా వున్నారు. లాస్ట్ మినిట్ లో స్నేహం పేరిట వైకాపా అభ్యర్థి ప్రచారానికి బన్నీ వెళ్లడం అన్నది వీళ్లకు కోపకారణం. ఈ కోపాన్ని నాగబాబు ప్రత్యక్షంగానే వ్యక్తం చేసారు. మనోడైనా పగోడే అనే రీతిలో ట్వీట్ వేసారు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం నాగబాబు తన సన్నిహితుల దగ్గర బన్నీ ని కాస్త ఘాటైన భాషతోనే విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ తన పెద్దరికానికి, హోదాకు తగినట్లు మౌనంగా వుండిపోయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ దగ్గర ఈ విషయం ప్రస్తావనకు వచ్చినపుడు కాస్త చికాకు పడి.. వదిలేయండి.. అని అన్నట్లు తెలుస్తోంది. ఇలా టాలీవుడ్ లో గ్యాసిప్ లు రకరకాలు గా వినిపిస్తున్నాయి.

కానీ బన్నీ మాత్రం మెగా బంధాలు తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. తాను 2019లో జనసేనకు అందరికన్నా ముందుగా రెండు కోట్లు విరాళం ఇచ్చిన విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అలాగే నాగబాబు అర్ధిక కష్టాల్లో వున్నపుడు బన్నీ నే ‘నా పేరు సూర్య’ సినిమాకు ప్రెజెంటర్ గా పేరు వేయించి కొంత సాయం అందేలా చేసారు. ఇన్ని చేసిన బన్నీ ఇప్పుడు జస్ట్ తన ఫ్రెండ్ కోసం ప్రచారానికి వెళ్లడం, మెగా ఫ్యామిలీ దృష్టిలో పాపం అయిపోయింది.

బన్నీకి సన్నిహితుడు బన్నీవాస్ గత ఎన్నికల్లో పవన్ కోసం విపరీతంగా కష్టపడి పని చేసారు. కానీ తరువాత పవన్ ఆయనను దూరం పెట్టారు. మళ్లీ పవన్ నే పిలిచి దగ్గరకు తీసి, కీలక బాధ్యతలు అప్పగించారు. బన్నీకి ఇష్టం లేకుండా అయితే బన్నీవాస్ జనసేన పట్ల కీలకంగా వ్యవహరించారు కదా.

బన్నీ సన్నిహిత వర్గాల బోగట్టా ప్రకారం, తను వెళ్లడం ఇంత గడబిడకు దారి తీస్తుందని బన్నీ అనుకోలేదు. తను వెళ్లిన విషయాన్ని వైకాపా పూర్తిగా ఓన్ చేసుకుని హడావుడి చేస్తుందని అనుకోలేదు. అదే సమయంలో ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ మరీ ఇంతలా భూతద్దంలో చూస్తుందని ఊహించలేదు. అందుకే మౌనంగా వుండిపోయినట్లు తెలుస్తోంది.

కానీ మెగా ఫ్యామిలీ జనాలు తమ అంతర్గత సంభాషణల్లో మాత్రం బన్నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తోంది. ఓ కీలకమైన వ్యక్తి పరుషమైన తిట్లు కూడా వాడుతున్నారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

బన్నీకి రామ్ చరణ్ కు పొసగదు అని చిరకాలంగా వున్న వదంతులు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఇక బన్నీ దూరం అనే రేంజ్ లో వినిపిస్తున్నాయి.