వాన కోసం ఎదురు చూస్తున్న జ‌నం

వాన కోసం ఏపీ ప్ర‌జానీకం ఎదురు చూస్తోంది. వేస‌వి కావ‌డంతో ఎండ దెబ్బ‌కు జనం అల్లాడుతున్నారు. ఉక్క‌పోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌రోవైపు పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో వాన ప‌డుతుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది. దీంతో త‌మ‌కు…

వాన కోసం ఏపీ ప్ర‌జానీకం ఎదురు చూస్తోంది. వేస‌వి కావ‌డంతో ఎండ దెబ్బ‌కు జనం అల్లాడుతున్నారు. ఉక్క‌పోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌రోవైపు పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో వాన ప‌డుతుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది. దీంతో త‌మ‌కు కూడా వాన రాక‌పోతుందా, వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌కుండా వుంటుందా? అని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

వేస‌వి వేడిని ఎన్నిక‌ల వేడి అధిగ‌మించింది. ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఎండాకాలం అలా గ‌డిచి పోతూ వుంది. మే నెల‌లో స‌గం రోజులు క‌రిగిపోయాయి. జూన్‌లో ప్ర‌వేశించామంటే విద్యా సంస్థ‌ల ప్రారంభ హ‌డావుడి మొద‌ల‌వుతుంది. క‌నీసం అప్ప‌టికైనా వేస‌వి తాపం త‌గ్గుతుందా? లేదా? అనే అనుమానం. ఇటీవ‌ల అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు ప‌డ్డాయి. అయితే వేస‌వి తాపాన్ని త‌గ్గించేంత కాక‌పోవ‌డంతో జ‌నం నిరుత్సాహం చెందారు.

ఇదిలా వుండ‌గా తాజాగా తెలంగాణ‌లో వ‌ర్ష సూచ‌న అక్క‌డి ప్ర‌జానీకంలో సంతోషాన్ని నింపుతోంది. రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. అంతేకాదు, హైద‌రాబాద్‌లో కుంభ‌వృష్టి త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. ఈ సంద‌ర్భంగా వాతావ‌ర‌ణ‌శాఖ ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. ఇప్ప‌టికే తెలంగాణాలో నిజామాబాద్‌, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్ త‌దిత‌ర జిల్లాల్లో వ‌ర్షం ప‌డింది.

ఈ ఏడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు నైరుతి రుతుప‌వ‌నాలు నాలుగైదు రోజులు ముందుగానే వ‌స్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ప్ర‌జ‌ల్లో ఆశ‌లు చిగురించాయి. స‌మ‌యానికి వ‌ర్షం ప‌డితే, రైతులు పంట‌ల సాగుకు స‌మాయ‌త్తం అవుతారు. వ‌ర్షం అంటే మ‌నిషి జీవితం. అందుకే వాన చినుకు కోసం ప్ర‌జ‌లు అంతగా ఎదురు చూస్తారు.