29 సినిమాలు.. 2 హిట్లు

మార్చి నెలలో అటుఇటుగా 29 సినిమాలు రిలీజ్ అయితే, వాటిలో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ మాత్రమే హిట్స్ అనిపించుకున్నాయి.

మార్చి నెల నుంచి సమ్మర్ సినిమాల హవా మొదలవుతుంది. ఏటా ఈ నెలలో కచ్చితంగా ఓ హిట్ పడుతుంది. ఆర్ఆర్ఆర్, బలగం, దాస్ కా ధమ్కీ, జాతిరత్నాలు లాంటి సినిమాలన్నీ మార్చి నెలల్లోనే వచ్చాయి. మరి ఈ ఏడాది మార్చి నెలలో హిట్ సినిమా ఏది?

మార్చి మొదటి వారంలో చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఏకంగా 10 సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఛావా అనే డబ్బింగ్ సినిమా ఓ మోస్తరుగా ఆకర్షించింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమా తెలుగులో హిట్టవ్వలేదు.

దీంతో పాటు వచ్చిన కింగ్ స్టన్, రాక్షస, శివంగి లాంటి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మహేష్-వెంకటేష్ నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు కూడా ఇదే వారం రీ-రిలీజ్ అయింది. కొన్ని థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది.

రెండో వారంలో కోర్ట్ సినిమా ఆధిపత్యం కనిపించింది. నాని నిర్మాతగా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఆకట్టుకుంది. ఈ జానర్ లో పేరుపొందిన ఇతర చిత్రాలతో పోలిస్తే, ఆ స్థాయిని అందుకోలేకపోయినా సినిమా మాత్రం సక్సెస్ సాధించింది. పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ అందించింది.

ఇదే సినిమాతో పాటు వచ్చిన దిల్ రూబ ఫ్లాప్ అయింది. ‘క’ లాంటి సక్సెస్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన ఈ సినిమా ఏ దశలోనూ మెప్పించలేకపోయింది. ప్రతిసారి మంచి ప్రయత్నాలు చేసే కిరణ్ అబ్బవరం ఈసారి విషయం లేని సినిమా చేసి ఫ్లాప్ తెచ్చుకున్నాడు.

మూడో వారం మరీ తీసికట్టుగా తయారైంది. 10 సినిమాలు రిలీజైతే ఒక్కటి కూడా ఆడలేదు. పెళ్లి కాని ప్రసాద్ సినిమా ప్రచారంతో ఆకట్టుకున్నప్పటికీ థియేటర్లలో తేలిపోయింది. మిగతా సినిమాల పేర్లు చెప్పుకోవడం కూడా అనవసరం. ఈ వారంలో సలార్, ఎవడే సుబ్రమణ్యం సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి.

నాలుగో వారంలో ఎంపురాన్ (లూసిఫర్ 2), మ్యాడ్ స్క్వేర్, వీర ధీర శూర, రాబిన్ హుడ్ సినిమాలు థియేటర్లలోకి రాగా, వీటిలో మ్యాడ్ స్క్వేర్ మూవీ విన్నర్ గా నిలిచింది. ఈ వారంలోనే కాదు, మార్చి నెల మొత్తంలో కమర్షియల్ గా సాలిడ్ హిట్ కొట్టింది ఈ సినిమా మాత్రమే.

నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా ఇటు కామెడీ అందించక, అటు థ్రిల్ ఇవ్వక చతికిలపడగా.. మోహన్ లాల్ నటించిన ఎంపురాన్, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. విక్రమ్ చేసిన వీరధీరశూర సినిమా కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ ఆడియన్స్ అటువైపు చూడడం లేదు.

మొత్తంగా మార్చి నెలలో అటుఇటుగా 29 సినిమాలు రిలీజ్ అయితే, వాటిలో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ మాత్రమే హిట్స్ అనిపించుకున్నాయి. ఎప్పట్లానే ఈ ఏడాది మార్చి నెలలో కూడా ఓ సక్సెస్ పడి, బాక్సాఫీస్ ఆనవాయితీని కొనసాగించింది.

9 Replies to “29 సినిమాలు.. 2 హిట్లు”

  1. ఒరేయ్ నిజంగా robinhood ప్లాప్ అనటానికి సినిమా చూసావా. కామెడీ లేదా. అనవసరం గా తిట్లు తినకు. నీ సన్నాసి పెన్ను నీ మొహం. Mad sqaure పెద్ద సినిమా నీకాదు అయినా అది commercialsolid హిట్ అంట.

Comments are closed.