జ‌గ‌న్‌పై క‌సితీరా ఓటు వేశారా?

ఎన్నిక‌లు ముగిశాయి. ఇక ఫ‌లితాలు వెలువ‌డాల్సి వుంది. ఎల్లో మీడియా రాత‌లు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని భ‌య‌పెట్టేలా ఉన్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై క‌సితీరా ఓటు వేశార‌ని, కావున కూట‌మికే అనుకూల తీర్పు వుంటుంద‌ని…

ఎన్నిక‌లు ముగిశాయి. ఇక ఫ‌లితాలు వెలువ‌డాల్సి వుంది. ఎల్లో మీడియా రాత‌లు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని భ‌య‌పెట్టేలా ఉన్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై క‌సితీరా ఓటు వేశార‌ని, కావున కూట‌మికే అనుకూల తీర్పు వుంటుంద‌ని ఎల్లో మీడియా రాయ‌డం ఆశ్చ‌ర్య‌మేమీ క‌లిగించ‌దు. ఎందుకంటే జ‌గ‌న్ ఓట‌మిని కోరుకునే శ‌త్రువుల్లో ఎల్లో మీడియా ప్ర‌ప్ర‌థ‌మంగా వుంది. ఎల్లో మీడియా త‌ర్వాతే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై నిజంగా జ‌నంలో అంత క‌సి వుందా? అనే చ‌ర్చ‌కు తెర లేచింది. క‌సి తీరా ఓటు వేయ‌డం అంటే… 2019లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఓటు వేసిన‌ట్టు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై జ‌నంలో ఎల్లో మీడియా రాస్తున్నంత క‌సి ఏమీ లేదు. 2019లోనూ జ‌గ‌న్‌కు 50 శాతం ఓటర్లు వ్య‌తిరేకంగా ఉన్నారని గుర్తు పెట్టుకోవాలి. నాడు చంద్ర‌బాబుపై జ‌నం తీవ్రంగా ర‌గిలిపోడానికి ఆయ‌న పాల‌నా వైఫ‌ల్య‌మే కార‌ణం. కానీ జ‌గ‌న్ విష‌యంలో అలా విమ‌ర్శించ‌డానికే లేదు.

2014లో ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌క‌టించిన‌ మేనిఫెస్టో అమ‌లుకు కేవ‌లం ప‌ది మార్కులు ప‌డ‌తాయి. ముఖ్యంగా రైతాంగం, మ‌హిళ‌లు, నిరుద్యోగ యువ‌త‌, ఉద్యోగుల ఆగ్ర‌హాన్ని చంద్ర‌బాబు చూర‌గొన్నారు. 2019కి వ‌చ్చే స‌రికి చంద్ర‌బాబు త‌మ మేనిఫెస్టోను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దాచి పెట్టారంటే, ఆయ‌న పాల‌న ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే అంత‌టి దారుణ‌మైన ఫ‌లితాల్ని 2019లో చంద్ర‌బాబు మూట‌క‌ట్టుకున్నారు.

కానీ జ‌గ‌న్ పాల‌న అందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. 2019లో న‌వ‌ర‌త్నాల పేరుతో ప్ర‌క‌టించిన మేనిఫెస్టోను 98 శాతం అమ‌లు చేశార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మ‌ద్య‌పాన నిషేధం, సీపీఎస్ ర‌ద్దు త‌దిత‌ర హామీల విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దోషిగా నిలిచింది. సంక్షేమ ప‌థ‌కాలను క‌రోనా లాంటి విప‌త్క‌ర కాలంలోనే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించారంటే జ‌గ‌న్ నిబ‌ద్ధ‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. త‌న పాల‌న న‌చ్చితేనే ఓటు వేయాల‌ని జ‌గ‌న్ అభ్య‌ర్థించారు.

ఇది ప్ర‌భుత్వ సానుకూల ఓటు వెల్లువ అని వైసీపీ చేస్తున్న వాద‌న నిజ‌మే అనేలా వుంది. ఐదేళ్ల‌లో మ‌హిళ‌లు, వృద్ధులకు సాయం అందించ‌డంలో జ‌గ‌న్ త‌న చిత్త‌శుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు వారి ఓట్లు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌య్యాయి. జ‌గ‌న్‌ను వారంతా వ్య‌తిరేకించ‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఒక్క‌టంటే ఒక్క‌టైనా చూపించ‌గ‌ల‌రా?  జ‌గ‌న్ వ్య‌తిరేకించే మ‌హిళ‌లు, వృద్ధులు 2019లో కూడా ఉన్నారు. ఇప్పుడా సంఖ్య త‌గ్గి వుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

త‌మ మేనిఫెస్టోకు ఆక‌ర్షితులై వారంతా బారులుతీరార‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు వాదిస్తున్నారు. చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త జ‌నానికి బాగా తెలుసు. అధికారం కోసం చంద్ర‌బాబు ఆకాశం నుంచి చంద‌మామ‌ను కూడా తీసుకొచ్చి ఇస్తాన‌ని చెబుతార‌ని ఎవ‌రికి తెలియ‌దు. సీఎం చెప్పిన‌ట్టు ఈ ఎన్నిక‌లు జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త‌కు, కూట‌మి క‌ట్ర‌ల‌కు మ‌ధ్య జ‌రిగాయి.  ఫ‌లితం కోసం మూడు వారాలు ఎదురు చూడ‌క త‌ప్ప‌దు.