మంచి డేట్.. మే 17 నుంచి దూరం జరిగిపోయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. విష్వక్ సేన్- నేహా శెట్టి- కృష్ణ చైతన్యల ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు వైరల్ కావడం ఆ సినిమాకు ప్లస్ అయింది. ఎన్నికల టైమ్ లో సరైన సినిమా పడలేదు. ఎన్నికలు 13న ముగిసిన వెంటనే మరో సినిమా లేదు. అలాంటి డేట్ ను బ్లాక్ చేసుకున్నారు. 17న ఈ సినిమా వుంటే మళ్లీ నెలాఖరు వరకు సరైన సినిమాలు లేవు
కానీ వున్నట్లుండి 17 నుంచి నెలాఖరుకు వెళ్లిపోయారు. నిజానికి జూన్ అన్నది సరైన సీజన్ కాదు సినిమాలకు. మరీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది వేరే సంగతి. సమ్మర్ హాలీడేస్ అయిన వెంటనే సినిమాల మీద అంత దృష్టి వుండదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 17న వచ్చి వుంటే సినిమా ఏ మాత్రం బాగున్నా రెండు వారాల రన్ వుండేది.
అయితే బ్యాక్ గ్రవుండ్ స్కోర్ రెడీ కాకపోవడం, ఎన్నికల టైమ్ లో సినిమాకు సరైన పబ్లిసిటీ చేసే అవకాశం లేకపోవడం, 14 నుంచి 17 మధ్యలో వుండే గ్యాప్ సరిపోకపోవడం వల్ల రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. కంటెంట్ బాగుంటే ఎప్పుడు వచ్చినా ఆడుతాయి సినిమాలు అనే ఆలోచనతో డేట్ మార్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా సంగతి పక్కన పెడితే, అసలు సరైన సినిమా ఈ నెల 17 న పడితే మాత్రం భలే వుండేది. జనాలు ఎన్నికల హోరు తో పిచ్చెక్కి వున్నారు. ఒక్కసారిగా మాంచి రిలాక్స్ అయ్యే అవకాశం దొరికేది. బ్లాక్ బస్టర్ పడేది. అయితే చిన్న సినిమాలకు ఈ అవకాశం తక్కువ. ఓ రేంజ్ ఓపెనింగ్ తెచ్చుకోగల సినిమా అయితేనే ఆ చాన్స్.