అబ్బే.. 80 శాతం కాదు, 70 కూడా లేదా!

ఏపీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ లో ఉద‌యం పూట మెరుగైన రీతిలో పోలింగ్ న‌మోదు కావ‌డంతో.. మీడియా పోలింగ్ శాతం అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది! ఉద‌య‌మే ఓట‌ర్లు బూత్ ల ముందు బారులు…

ఏపీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ లో ఉద‌యం పూట మెరుగైన రీతిలో పోలింగ్ న‌మోదు కావ‌డంతో.. మీడియా పోలింగ్ శాతం అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది! ఉద‌య‌మే ఓట‌ర్లు బూత్ ల ముందు బారులు తీరారు. ఇక్క‌డి వ‌ర‌కూ నిజ‌మే! అందుకు ప్ర‌ధాన కార‌ణం.. లేట్ అయితే ఎండ‌కు త‌ట్టుకోలేమ‌ని జ‌నాలు ఉద‌య‌మే పోలింగ్ బూత్ ల‌ను చుట్టుముట్టారు!

ఉద‌యం ఏడు గంట‌ల‌కే ఓటేసి వాట్సాప్ స్టేట‌స్ లు పెట్టుకున్న వారు బోలెడుమంది. ఎనిమిది, తొమ్మిది లోపే.. జ‌నాలు ఓటేయ‌డానికి ఎగ‌బ‌డ్డారు! ప‌ది గంట‌ల‌కు ఈ బ్యాచ్ అంతా ఓట్ వేసేసి ఇళ్ల‌ను చేరుకుంది! దీంతో .. ఉద‌య‌మే భారీగా పోలింగ్ శాతం న‌మోద‌య్యింది. ప‌దింటికే ముప్పై నుంచి న‌ల‌భై శాతం పోలింగ్ పూర్త‌యిన బూత్ లెన్నో ఉన్నాయి! 

క‌నీసం ఆరు వంద‌ల నుంచి వెయ్యి ఓట్లు ఉన్న బూత్ ల‌లో అలా ఉద‌యం ప‌దికే న‌ల‌భై శాతం వ‌ర‌కూ పోలింగ్ న‌మోదు కావ‌డంతో.. ఈ సారి ఏపీలో భారీగా పోలింగ్ న‌మోదు అవుతుంద‌నే అంచ‌నాల‌ను మీడియా సంస్థ‌లు ఊద‌ర‌గొట్టాయి! అదిగో.. జ‌నాలు, ఇదిగో జ‌నాలు అంటూ హ‌డావుడి చేశారు. అయితే మ‌ధ్యాహ్నానికి పోలింగ్ బూత్ లు చాలా చోట్ల వెల‌వెల‌బోయాయి. భోజ‌న విరామం వ‌ర‌కూ జ‌నాలు క్యూల‌లో క‌నిపించారు. కానీ రెండు త‌ర్వాత ప‌రిస్థితి మారిపోయింది. మ‌ళ్లీ ఐదింటి వ‌ర‌కూ ఎక్క‌డా హ‌డావుడి లేదు!

దీంతో ఉద‌యమే న‌ల‌భై శాతం పోల్ ప‌ర్సెంటేజ్ న‌మోదు కావ‌డంతో.. 80 శాతం, అంత‌కు మించి అంచ‌నాలు అనుకున్న ప‌రిస్థితి కాస్తా సాయంత్రానికి నిజం కాలేదు! సాయంత్రం ఆరింటికి  కూడా పోలింగ్ శాతం 68 వ‌ర‌కే న‌మోదు కావ‌డం విశేషంగా మారింది. ఎన‌భై శాతం, అంత‌కు మించి అనుకున్న‌ది కాస్తా.. తుది లెక్క‌ల్లో క‌నీసం 70 అయినా రీచ్ అవుతుందా అనేది ప్ర‌శ్నార్థకంగా మారింది. ఆరింటికి క్యూలైన్ల‌లోకి వ‌చ్చిన వారంద‌రికీ స్లిప్ ల‌ను ఇచ్చి ఓటింగ్ కు అవ‌కాశం ఇచ్చారు అధికారులు, ఆరింటికి క్యూ లైన్ల గేట్లు క్లోజ్ చేశారు. దీంతో తుది లెక్క‌ల్లో కాస్త పెరుగుద‌ల ఉండ‌వ‌చ్చు!