ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. అధికారం ఎవరిదో స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనడంతో అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఆయా పార్టీల నేతలు అధికారం తమదంటే తమదే గట్టిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డా వైఎస్సార్ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలున్నాయి. ఎన్నికల తీరు, పోలింగ్ నమోదు, ఓటర్ల మనోభావాలు పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయా స్థానాలపై నిపుణుల మెజార్టీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. జమ్మలమడుగులో అత్యధికంగా 86.3 శాతం నమోదు కావడం గమనార్హం. మిగిలిన నియోజకవర్గాల్లో.. ప్రొద్దుటూరు 79.11 %, కమలాపురం 75.16%, మైదుకూరు 84.06%, బద్వేలు 78.55%, పులివెందుల 81.06%, కడప 62.83 %, రాజంపేట 75.46%, రైల్వేకోడూరు -74.13 %, రాయచోటి 76.08 % చొప్పున పోలింగ్ శాతం నమోదైంది.
వీటిలో ప్రొద్దుటూరుపై టీడీపీ ఆశ పెట్టుకోవచ్చు. అయినప్పటికీ స్వల్ప మెజార్టీతో అయినా వైసీపీ బయట పడుతుందని చెప్పేవాళ్లు లేకపోలేదు. మిగిలిన అన్ని చోట్ల వైసీపీ విజయం ఢంకా మోగిస్తుందని మెజార్టీ అభిప్రాయం. ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప నియోజకవర్గాల్లో కూడా గెలుస్తామని కొంత కాలంగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కానీ ఆ పరిస్థితి లేదని ఎన్నికల సరళి చెబుతోంది.
మైదుకూరులో ఎన్నికల ముందు రోజు వరకూ పుట్టా సుధాకర్ యాదవ్ గెలుస్తారని ప్రచారం జరుగుతుంది. తీరా ఎన్నికల ఫలితం మాత్రం రఘురామిరెడ్డికి అనుకూలంగా వుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. కడపలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ భారీ ప్లాన్ చేసింది. కానీ వర్కౌట్ కాలేదని ఓటర్ల మనోగతం చెబుతోంది. కావున మరోసారి కడపపై టీడీపీకి నిరాశే ఎదురు కానుందని అంటున్నారు. ఇక రాజంపేట, కడప ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలవనుందని విశ్లేషకుల మాట.