నాగబాబు ఒక్కరు చాలు!

జనసేనకు తలకాయ నొప్పులు తేవడానికి ఎక్కువ మంది అవసరం లేదు. నాగబాబు ఒక్కరు చాలు. ఆయనకు కోపం, ముందు వెనుక ఆలోచించకుండా మాట విసిరేయడం నాగబాబుకు అలవాటు అని సన్నిహితంగా చూసిన వారు చెబుతారు.…

జనసేనకు తలకాయ నొప్పులు తేవడానికి ఎక్కువ మంది అవసరం లేదు. నాగబాబు ఒక్కరు చాలు. ఆయనకు కోపం, ముందు వెనుక ఆలోచించకుండా మాట విసిరేయడం నాగబాబుకు అలవాటు అని సన్నిహితంగా చూసిన వారు చెబుతారు. రాజకీయాలకు ఇలాంటివి పనికిరావు. పైగా తెలుగుదేశంతో పొత్తు వుంది. అదృష్టం బాగుండి అధికారం అందితే అన్ని విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాల్సి వుంటుంది. దుందుడుకు వైఖరి అస్సలు పనికి రాదు.

నిన్నటికి నిన్న అల్లు అర్జున్ ను పరోక్షంగా ఉద్దేశించి నాగబాబు వేసిన ట్వీట్ మెగా ఫ్యామిలీలో లుకలుకలను మరోసారి బయటకు తెచ్చింది. గతంలో బన్నీ చెప్పను బ్రదర్ అన్నపుడు కానీ మెగాస్టార్ మరోసారి సినిమాలు స్టార్ట్ చేసాక ఒక్క సినిమా గీతా బ్యానర్ లో చేయడపోవడం, అల్లు స్టూడియో, అల్లు ఎంటర్ టైన్ మెంట్ అంటూ తమకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకునే ప్రయత్నం ఇవన్నీ కలిసి మెగా ఫ్యామిలీ లో అల్లు ఫ్యామిలీ వేరు అనే భావనను అనేక సార్లు చెప్పకనే చెప్పాయి.

స్వయం కృషితో బన్నీ ఎదిగాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మిగిలిన పాన్ ఇండియా స్టార్ లు అందరినీ రాజమౌళి తయారు చేస్తే, బన్నీ తానే దర్శకుడు సుకుమార్ ను పాన్ ఇండియా డైరక్టర్ ను చేసాడు. తన మిత్రుడు కదా అని వైకాపా అభ్యర్ధి కి మద్దుతగా బన్నీ వెళ్లడం తప్పేమీ కాదు. హీరో వెంకటేష్ తమ బంధువులు కదా అని తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్ధికి, ఆంధ్రలో భాజపా అభ్యర్ధి కామినేని శ్రీనివాస్ కు మద్దతుగా ప్రచారానికి వెళ్లలేదా? మెగాస్టార్ నే పలువురికి మద్దతుగా వీడియో బైట్ లు ఇవ్వలేదా.. వ్యక్తిగతంగా ఎవరి అభిమానాలు వారికి వుంటాయి.

నాగబాబు దానిని విస్మరించి, బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేసి వుంటే వేరేలా వుండేది. బన్నీకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. తెలుగుదేశం-జనసేన మధ్య ఎప్పటికైనా మిత్ర బేధం అనేది వస్తే దానికి కారణం నాగబాబే కావడానికి ఎక్కువ కారణం అవుతారని ఓ జనసేన కీలక మద్దతు దారు కామెంట్ చేయడం ఇక్కడ గమనార్హం.