పాపం వర్మ: ఏరు దాటాక బోడి మల్లన్న!

ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్న సామెత చందంగా ఉంది పిఠాపురం సీటును పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ పరిస్థితి. ఇలా పోలింగ్ పూర్తయిందో లేదా..…

ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్న సామెత చందంగా ఉంది పిఠాపురం సీటును పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ పరిస్థితి. ఇలా పోలింగ్ పూర్తయిందో లేదా.. జనసేన నాయకులు వర్మను పూర్తిగా మరచిపోయారా.. పక్కన పెట్టేశారా.. అని అక్కడి ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు.

ఎందుకంటే పోలింగ్ పూర్తయిన తర్వాత.. పవన్ కల్యాణ్ కోసం నియోజకవర్గ ప్రజలందరూ ప్రేమగా ఓటు వేశారంటూ వారికి జనసేన తరఫున ధన్యవాదాలు తెలియజేసిన నాగబాబు కనీసం వర్మ పేరును కూడా ప్రస్తావించలేదు. పట్టణ, వార్డు స్థాయిలో పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు శ్రమించిన వారి సేవలను గుర్తిస్తామని నాగబాబు అన్నారే తప్ప.. సీటును త్యాగం చేయడం సహా, నియోజకవర్గంలో అన్నీ తానై చూసుకున్న వర్మ పేరు ఎత్తనేలేదు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున వర్మ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో టికెట్ తనకే అనే చంద్రబాబు హామీ ఎప్పటినుంచో ఉండడంతో ఈ అయిదేళ్లూ నియోజకవర్గాన్ని వీడిపోకుండా చాలా కష్టపడుతూ వచ్చారు. పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకున్నారు. అంతా చేసుకున్న తర్వాత.. చివరిక్షణాల్లో పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తుల్లోకి వచ్చి పిఠాపురం మీద కన్నేశారు.

వర్మ ఆ స్థానాన్ని కోరుకోవడంలో ఒక అర్థముంది. ఆయన అక్కడ అయిదేళ్లు పాటూ కష్టపడి పనిచేశారు. కానీ, పవన్ కల్యాణ్ అదే స్థానాన్ని కోరుకోవడం వెనుక.. అక్కడ కాపు కులం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నదనేది తప్ప మరొక కారణం లేనేలేదు. అలాగని కాపు కులం ఓట్లన్నీ గంపగుత్తగా ఆయనకు పడిపోతాయనే నమ్మకం కూడా లేదు.

ఎందుకంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అదే వర్గానికి చెందిన వంగా గీతను అక్కడ అభ్యర్థిగా మోహరించింది. పవన్ తాను పిఠాపురం నుంచి పోటీచేస్తున్నానని అన్న తర్వాత.. వర్మ తిరుగుబాటు చేయడం.. ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతానని అనడం.. చంద్రబాబు పిలిపించి బుజ్జగించడం, తొలివిడతలోనే ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇవ్వడం వంటి నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎట్టకేలకు వర్మ పార్టీ కోసం సీటు త్యాగం చేశారు.

పవన్ కల్యాణ్ పిఠాపురంలో వర్మ ఇంటికి వెళ్లారు. ఆయనతో చేయి కలిపారు. ఆయన త్యాగం వల్లనే తాను అక్కడ పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ఆయనను నెత్తిన పెట్టుకున్నట్టుగా కనిపించారు. మురిసిపోయిన వర్మ ఎన్నికల ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. మధ్యలో జనసేన పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త ప్రచారానికి తిరుగుతూంటే.. నియోజకవర్గ వ్యవహారాలు అన్నీ వర్మ చూసుకున్నారు.

పవన్ కల్యాణేమో.. పోలింగ్ నాడు మంగళగిరిలో ఓటు వేసేసి భార్యతో కలిసి వారణాసి వెళ్లారు. నియోజకవర్గ ప్రజలకు థాంక్స్ కూడా నాగబాబు చెప్పారు. ఆయన వర్మను చాలా జాగ్రత్తగా ‘ఇగ్నోర్’ చేశారు. వర్మ పరిస్థితి ఏరు దాటాక బోడిమల్లన్న అన్న తీరుగా తయారైందని అక్కడి తెలుగుదేశం శ్రేణులు ఉడికిపోతున్నాయి.