దేశ ప్రజల్లో చాలా మందికి ఉత్కంఠ కలిగించే, ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో ఉంటాయి. సాధారణంగా ప్రజలు సినిమా అండ్ రాజకీయ రంగాల్లో ఉండే ప్రముఖుల జీవితాలపై ఆసక్తి చూపుతుంటారు. వీళ్ళనే సెలబ్రిటీలు అంటుంటాం. వారి లైఫ్ లో ఏ సంఘటన జరిగినా జనం దానిపై ఆసక్తి చూపుతుంటారు. అందులోనూ ప్రస్తుత కాలంలో మీడియా అనేక రూపాల్లో వ్యాపించింది కాబట్టి రకరకాల కథనాలు చక్కర్లు కొడుతుంటాయి.
దేశ ప్రజలకు చాలా ఏళ్లుగా ఆసక్తి కలిగిస్తున్న అంశం.. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి. ఆయన సోదరి ప్రియాంకకు వివాహమై చాలా ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. బాబాయి సంజయ్ గాంధీ కొడుకు వరుణ్ గాంధీకి పెళ్లయి ఆయనకు ఒక పిల్లో పిల్లగాడో ఉన్నారు. కానీ పెళ్లి కాకుండా మిగిలిపోయాడు రాహుల్ గాంధీ. ఆయనకు ఇప్పుడు 54 ఏళ్ళు. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న దానిపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వాటిల్లో నిజాలేమిటో అబద్ధాలేమిటో తెలియదు. తల్లి సోనియా కారణంగానే రాహుల్ కు పెళ్లి కాలేదని కొందరు అన్నారు.
రాహుల్ ఏదో దేశం అమ్మాయిని ప్రేమించాడని, అది సోనియాకు ఇష్టం లేదని, దాంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడని ఒకప్పుడు మీడియాలో వచ్చింది. కొందరు జ్యోతీష్యులు ఆయన జాతకం పరిశీలించి ఆయన జాతకంలో యేవో దోషాలు ఉన్నాయని, అందుకే పెళ్లి కావడం లేదని చెప్పారు. సినిమా తారల విడాకుల గురించి చెప్పి సంచలనం సృష్టిస్తున్న హైదరాబాదుకు చెందిన ఓ జ్యోతిషుడు రాహుల్ గాంధీకి అసలు పెళ్లి కాదని, ఆయనకు ఆ యోగం లేదని చెప్పాడు.
గతంలో రాహుల్ ఓ కాలేజీకి వెళ్లి స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఓ అమ్మాయి లేచి మీరు చాలా అందంగా ఉంటారు. మరి ఇప్పటి వరకు పెళ్ళెందుకు చేసుకోలేదు అని ప్రశ్నించగా తాను కాంగ్రెస్ పార్టీకి అంకితమయ్యానని, పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని చెప్పాడు. గతంలో బీహార్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నప్పుడు రాహుల్ గాంధీకి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. సోనియా గాంధీ యూపీలోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమ్మాయిని రాహుల్ గాంధీ కోసం చూసిందని వార్త వచ్చింది. తరువాత ఏమైందో తెలియదు.
ఇలా.. ఎన్నెన్నో కథనాలు, వార్తలు రాహుల్ చుట్టూ తిరిగాయి. ఆయన కాలేజీలకు వెళ్ళినప్పుడల్లా మీ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నే ఎదురవుతుంది. కారణాలు ఏమైనా ఆయన పెళ్లి ఆసక్తికరమైన అంశంగానే ఉండిపోయింది. తాజాగా తన నియోజకవర్గమైన రాయబరేలీలో నిర్వహించి ఎన్నికల ప్రచార సభలో ఆయనకు పెళ్లి ప్రశ్న ఎదురైంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేం. నిన్న హైదరాబాదులో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని కాలేడని, కాబట్టి పెళ్లి చేసుకోవడం మంచిదని అన్నాడు. ఒకవేళ ప్రధానిగా పెళ్లి చేసుకుంటాడేమో ఎవరికీ తెలుసు?