అక్కడ గెలిస్తే మినిస్టరే మరి!

ఆలూ లేదు చూలూ లేదు అపుడే మంత్రి పదవుల మీద ఊసులు సాగుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి లో అయితే సీరియస్ గానే ఉన్నారు. అధికారంలోకి వస్తున్నామని…

ఆలూ లేదు చూలూ లేదు అపుడే మంత్రి పదవుల మీద ఊసులు సాగుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి లో అయితే సీరియస్ గానే ఉన్నారు. అధికారంలోకి వస్తున్నామని ఆ పార్టీ అభ్యర్థులు నేతలు ధీమాగా చెబుతున్నారు.

మహిళలు అంతా ఓటు వేసింది చంద్రబాబుని చూసే అని అంటున్నారు. ఈసారి అధికారం పక్కా అని భావిస్తున్నారు. దాంతో జిల్లా నుంచి మంత్రి పదవులకు చాన్స్ ఎవరికి అన్న చర్చకు తెర లేస్తోంది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన తరఫున దాదాపు పదిహేనేళ్ల తరువాత పోటీ చేశారు.

ఆయన చివరి సారిగా పోటీ చేసింది 2009లో. ఆయన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రిగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. మధ్యలో రెండు ఎన్నికలను వదిలేసి ఇపుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్యంగా టికెట్ దక్కింది. అదే విధంగా అదృష్టం కలసి వచ్చి మంత్రి పదవి చేజిక్కుతుందని కొణతాల వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు.

ఇక్కడ సెంటిమెంట్ ని కూడా వారు ముందుకు తెస్తున్నారు. అనకాపల్లిలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, వారే మంత్రులు అవుతారని కూడా చెబుతున్నారు. అనకాపల్లి నుంచి గతంలో గంటా శ్రీనివాసరావు, ప్రస్తుతం వైసీపీ నుంచి గుడివాడ అమర్నాధ్ మంత్రులుగా ఉన్నారు.

అనకాపల్లిలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది గత నలభై ఏళ్లుగా రుజువు అవుతోంది అని అంటున్నారు. ఇవన్నీ కలిసి గెలిచేది జనసేన. ఏపీలో వచ్చేది టీడీపీ కూటమి అని వారు జోస్యం చెబుతున్నారు. కొణతాల పదిహేనేళ్ళ తరువాత మరోసారి మంత్రి అవుతారు అని అంటున్నారు.

అయితే ఇతర జనసేన నేతలు కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్ కి మినిస్టర్ ఆసలు ఉన్నాయని అంటున్నారు. టీడీపీలో చూస్తే లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. ఇంతకీ ఎవరిది అధికారం దక్కుతుందో ఏమిటో అన్నది జూన్ 4 వరకూ వేచి చూస్తే ఆ మీదట ఈ ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని అంటున్న వారూ ఉన్నారు.