ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. మరీ ఇంత ఆలస్యమా అంటూ జనం నిట్టూర్చుతున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం మాత్రం టీడీపీ ఎన్నికల తేదీపై కొంచెం ఆనందిస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు అంతకాలం ఎన్నికల ఖర్చులు భరించాలంటే కష్టమనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల జాప్యం వెనుక తామే ఉన్నామని చంద్రబాబు, ఆయన అనుచరులు పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పటికే వైసీపీ నాలుగు సిద్ధం సభలు నిర్వహించి ఊపు మీద వుంది. అలాగే ఎన్నికల షెడ్యూల్ రావడానికి రెండు గంటల ముందు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరినీ ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. గతంతో పోల్చుకుంటే చంద్రబాబునాయుడు కాస్త ముందుగా మెజార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. జనసేన, బీజేపీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటిస్తే రచ్చరచ్చ తప్పదనే భయం కూటమిని వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో సుమారు రెండు నెలల గడువు వుండడం వల్ల అసంతృప్తులను బుజ్జగించుకోవచ్చనేది కూటమిలోని పార్టీల భావన. ఇదంతా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే మేనేజ్ చేసి, ఎన్నికలను కాస్త ఆలస్యంగా జరిగేలా చక్రం తిప్పామని చంద్రబాబు అనుకుంటున్నారు. అదే మాటను టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే ఏదైనా ఒత్తిడితో నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తున్నారా? లేక సహజంగానే ఆలస్యమవుతుందా? అనేది కేంద్ర ఎన్నికల అధికారులకు మాత్రమే తెలియాలి. ఎన్నికలను ఆలస్యంగా జరిగేలా చేయడంతో మొదటి విజయం సాధించామని టీడీపీ ఒక రకమైన ఆనందాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.