ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు మైకు చిక్కితే చాలు…బచేతులు తిప్పుతూ, తండ్రి వైఎస్సార్‌ను అనుకరిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మీ రాజన్న బిడ్డనంటూ పదేపదే గుర్తు చూస్తుంటారు. వైఎస్సార్‌ను ఉచ్ఛరించనిదే ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఎందుకంటే వైఎస్సారే ఆమె ఆయుధం. వైఎస్సార్‌ను స్మరించకపోతే ఆమెను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.
ఇదిలా వుండగా ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న విశాఖ బహిరంగ సభలో మాట్లాడుతూ 25 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ని గెలిపిస్తే చాలని కోరారు. భవిష్యత్‌లో షర్మిల సీఎం అవుతారని అన్నారు. అలాగే షర్మిల మాత్రమే వైఎస్సార్‌కు నిజమైన రాజకీయ వారసురాలని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంత వరకూ బాగా వుంది.
అయితే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే విషయమై స్పష్టత లేదు. తన అన్నను గద్దె దించాలని ఆమె పట్టుదలతో ఉన్నారు. ప్రతి సభలోనూ తన అన్న వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే తన పోటీపై మాత్రం గోప్యత ఎందుకు పాటిస్తున్నారో కాంగ్రెస్ శ్రేణులకే అర్థం కావడం లేదు.
హైదరాబాద్‌లో ఆమెకు ఓటు హక్కు వుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడే ఓటు వేశారు. ఈ దఫా పోటీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారో మనసులో మాట షర్మిల బయట పెట్టడం లేదు. పులివెందుల అసెంబ్లీ లేదా కడప లోక్‌సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆమె వాలకం చూస్తుంటే, అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు.
ఒకవేళ పోటీ చేసినా టీడీపీ నేతలే ఆమెకు మద్దతుగా ఏజెంట్లగా కూచోవాల్సి వుంటుంది. క్షేత్రస్థాయిలో ఆమెకు అంత సీన్ లేదు. ఆ వాస్తవం తెలియడం వల్లే షర్మిల ఎన్నికల్లో పోటీపై ఆచితూచి అడుగులు వేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది.