నిజానికి ఇది ప్రశ్నే కాదు. ఎందుకంటే ఎన్నికల వేళ ఎలాంటి నాయకుడికైనా టెన్షన్ వుంటుంది. అయితే గెలుపు ధీమా వుంటే ఈ టెన్షన్ తక్కువ వుంటుంది. లేదంటే ఎక్కువ వుంటుంది. జగన్ విషయానికి వస్తే ఆయన ఫేస్ ఎప్పుడూ నవ్వుతూ వుంటుంది. ఎప్పుడూ నవ్వు మొహంతో వుండడం ఒక్కోసారి ఇబ్బందిగా కూడా మారుతోంది. చావు పరామర్శలకు వెళ్లినపుడు కూడా నవ్వు మొహం పెట్టడంపై జగన్ అంటే కిట్టని వారు తరచు విమర్శలు చేస్తుంటారు.
ఇలా సదా నవ్వు మొహంతో వుండే జగన్ ఇటీవల ఎప్పుడు చూసినా కాస్త టెన్షన్ తో వున్నట్లు కనిపిస్తున్నారు. అంతే కాదు, మొహంలో కాస్త బాధే కనిపిస్తోంది. అన్ని వైపుల నుంచి తనను చుట్టు ముట్టారనో, తాను ఒంటరి పోరు సాగించాల్సి వస్తోందనో, ఇంటి మనుషులు, వైరి వర్గాలు, తనంటే కిట్టని మీడియా తన మీద పై చేయి సాధిస్తున్నారేమో అన్న భావనో, మొత్తం మీద జగన్ మొహంలో కళ అయితే కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.
నిన్నటికి నిన్న ఇడుపుల పాయ వద్ద జరిగిన పార్టీ అభ్యర్థుల ప్రకటన కార్యక్రమం ఆద్యంత జగన్ చాలా డల్ గా కనిపించారు. మొహంలో అస్సలు కళ లేదు. యుద్దం ప్రారంభించే సమయంలో నాయకుడు ధైర్యంగా కనిపించాలి. మొహంలో కదనోత్సాహం తొంగి చూడాలి. అలా కాకుండా ఇలా డల్ గా వుంటే పార్టీ శ్రేణులకు రాంగ్ సంకేతాలు వెళ్తాయి.
ఎందుకంత కంగాళీ చేసుకున్నారో?
టికెట్ ల కేటాయింపు జరిగిన తరువాత చాలా మందికి వచ్చిన అనుమానం ఇది. దాదాపు గత నెల రోజులుగా ఇక్కడి వాళ్లను అక్కడికి మార్చి, అక్కడి వాళ్లను ఇక్కడకు మార్చి, నానా హంగామా చేసారు. నిన్న ఇచ్చిన పేరును ఈ రోజు మార్చేయడం, రేపు మళ్లీ ఎవరి పేరు ప్రకటిస్తారో అని అనుకోవడం మామూలైంది. అసలు ఆదికి ముందుగా ఎవరు ప్రకటించమని అడిగారు. ఆ వెంటనే ఎవరు మార్చమన్నారు? ఇదంతా ఓ ప్రహసనంగా మారిపోయింది.
తీరా చేసి టికెట్ ల కేటాయింపు చూస్తే, 175 సీట్లలో పాతిక మంది వరకు టికెట్ లు ఇవ్వలేదు. మహా అయితే డజనుకు పైగా జనాలకు స్థానం మారింది. కానీ జరిగిన గడబిడ చూస్తే అసలు సగానికి పైగా సిట్టింగ్ లకు టికెట్ లు దొరకనంత. అసలు వీళ్లకు మరోసారి టికెట్ ఇవ్వరు అనుకున్న వారికి కూడా జగన్ జాబితాలో టికెట్ దొరికేసింది. 175 సీట్లో 25 మంది అంటే పెద్ద సంఖ్య కాదు. అందువల్ల టికెట్ ల జాబితా చూస్తే, రొటీన్ గా అనిపించింది తప్ప కొత్తగా అనిపించలేదు. అందువల్ల రావాల్సిన జోష్ కార్యకర్తల్లో రాలేదు.
సమతూకం సమస్య
నిజానికి 175 స్థానాలు లెక్క వేసుకుంటే బిసి లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మిగిలిన వారికి కూడా సముచిత స్థానం కల్పించారు. కానీ ఇది ఎలా జరిగింది అంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా, రాజకీయంగా డామినేట్ చేసే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో కాకుండా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే కనిపించింది.
ఎప్పుడయితే బిసి లకు అధిక స్థానాలు కేటాయించి తమ మీద పై చేయి సాధించిందో, తెలుగుదేశం పార్టీ వేరే రూట్ లో వచ్చింది. ఆ సంగతిని పక్కన పెట్టి, రెడ్డి సామాజిక వర్గానికి 50 వరకు సీట్లు కేటాయించిన అంశం, రాయలసీమలో 90శాతం వారికే టికెట్ లు ఇచ్చిన అంశాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టింది.
తెలుగుదేశం పార్టీ రెడ్లు, కమ్మ వారికి దగ్గర దగ్గర 60 సీట్ల వరకు ఇచ్చింది. వైకాపా కమ్మవారికి పాతిక, ముఫై సీట్లు ఇచ్చే అవకాశం లేదు కనుక, ఆ సీట్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి వెళ్లిపోయాయి. దాంతో 49 మంది వరకు అదే వర్గానికి చెందిన వారి పేర్లు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు వైరి పక్షం ప్రచారానికి దీటుగా వైకాపా తను బిసి లకు, మహిళలకు ఎక్కువ స్థానాలు ఇచ్చిన విషయాన్ని ప్రచారం చేసుకోవాల్సి వుంటుంది.