రాజకీయాల్లో ఒక దశ దాటి పతనం ఆయిన తరువాత ఇక అడ్డూ అదుపూ ఉండదు. బరితెగింపు వచ్చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో యిప్పుడు అలాంటి బరితెగింపు కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చి చేరుతారా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుదామా.. వారు కోరిన నియోజకవర్గంలో టికెట్ కేటాయించేద్దామా అని చంద్రబాబు నాయుడు ఎదురుచూస్తూ కూర్చున్నట్లుగా తెలుగుదేశం పార్టీ దుస్థితిలో ఉంది.
సొంత పార్టీ సీనియర్లను కూడా చెత్తబుట్టలో దఖలు పరుస్తూ.. ఇతర పార్టీల నుంచి తరలివచ్చే వారిని మాత్రం చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఆత్రుతలో కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. అలాంటిదే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబాన్ని తెలుగుదేశంలో చేర్చుకోవడం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల కాలంలో దేశం మొత్తాన్ని కుదిపేసిన కుంభకోణాలలో ఢిల్లీ లిక్కర్ స్కాం ఒకటి. తమాషా ఏమిటంటే అదే లిక్కర్ స్కామ్ లో గతంలో ఎంపీగా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ బృందం అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. అదే కేసులో కవిత కంటే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవరెడ్డిని ఎంపీగా గెలిపించి దేశంలోని అత్యున్నత చట్టసభకు పంపడానికి చంద్రబాబు నాయుడు తన పార్టీలో చేర్చుకుంటున్నారు.
ఇంత దిగజారుడుతనం మరొకటి ఉంటుందా అని ప్రజల ప్రశ్నిస్తున్నారు. అప్రూవర్ గా మారినంత మాత్రాన మాగుంట రాఘవరెడ్డి నిందితుడు కాకుండా పోతాడా అని ప్రశ్నిస్తున్నారు.
దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిని పార్లమెంటుకు పంపాలని నిర్ణయించుకోవడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు తనకు తాను ఆత్మ సమీక్ష చేసుకోవాలి. ఇలాంటి అవినీతిపరులను, నేరపూరిత వ్యక్తులను ఏ ఉద్దేశంతో పార్టీలో చేర్చుకుంటున్నారో ఆయన సంజాయిషీ చెప్పాలి.
కేవలం మాగుంట కుటుంబం నుంచి పార్టీకి అందగల కోట్లాది రూపాయల విలువైన ముడుపుల కోసం ఆశపడి చంద్రబాబు నాయుడు నైతికంగా అనేక మెట్లు దిగజారి మాగుంట కుటుంబాన్ని తమ పార్టీలో చేర్చుకుంటున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి పోకడలను అసహ్యించుకుంటున్నారు.