తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కవితను ఈడీ అరెస్టు చేసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆమెను శుక్రవారం రాత్రి ఢిల్లీకి ఢిల్లీకి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు కూడా చేయించి కోర్టులో హాజరుపరిచారు. ఈడీ కోరిక మేరకు ఆమెను ఈనెల 23వ తేదీ వరకు కష్టడీకి అప్పగించారు. ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ సాగుతుంది. ఆమె ఏ మేరకు విచారణకు సహకరిస్తారనేది నెమ్మదిగా తేలుతుంది. మొత్తానికి కల్వకుంట్ల కవిత అరెస్టు అనేది తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలన అంశం.
అయితే కవిత అరెస్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ చెబుతున్న భాష్యం మాత్రం చిత్రంగా ఉంది. కెసిఆర్ ప్లాన్ ప్రకారమే కవిత అరెస్టు జరిగిందట. బిజెపి, భారాస కుమ్మక్కు రాజకీయాల్లో ఇదొక కొత్త నాటకం మాత్రమేనట. అరెస్టు ద్వారా అటు బిజెపికి, ఇటు భారాసకు కూడా రాజకీయ మైలేజి ఉంటుందని.. ఉభయులూ పరస్పరం ఒకరికొకరు మేలు చేసుకోవడానికే.. ఇలాంటి సరికొత్త నాటకం ఆడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బిజెపి , బారాస పార్టీలు కుమ్మక్కు అయి పని చేస్తున్నాయని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. కేవలం మోడీ కి మేలు చేయడానికే, మోడీ వ్యతిరేక ఓటును చీల్చడానికి కెసిఆర్ జాతీయపార్టీ గా రూపు మార్చారని ఒక పుకారు ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ కు మేలు చేయడానికే.. బండి సంజయ్ ను బిజెపి సారథ్య బాధ్యతలు నుంచి తప్పించారని కూడా ఒక ప్రచారం ఉంది.
ఇప్పుడు కవిత అరెస్టు అనేది.. ఆ నాటకానికి కొనసాగింపు మాత్రమే అనేది రేవంత్ అభిప్రాయం. కన్న కూతురును అరెస్టు చేస్తోంటే కెసిఆర్ అక్కడకు రాకపోవడమే ఇందుకు నిదర్శనం అని ఆయన అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం పెద్ద డ్రామా అంటున్నారు. అరెస్టు చేసిన ఘనత గల పార్టీగా మైలేజీ కోసం బిజెపి, అరెస్టు అనంతర సానుభూతి ఓట్ల కోసం భారాస అరాటపడుతున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు.
నిజమో కాదో తెలియదు గానీ రేవంత్ ఈ మాటలను జనం నమ్మగలిగేలా చెప్పడమే అసలు ట్విస్టు.